Telugu Global
Telangana

తెలంగాణకు రెండో డిప్యూటీ సీఎం.. రేసులో వాళ్లే..!

తెలంగాణ కేబినెట్‌లో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరు ఖాళీలను సామాజిక ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తారని తెలుస్తోంది.

తెలంగాణకు రెండో డిప్యూటీ సీఎం.. రేసులో వాళ్లే..!
X

సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కేబినెట్ విస్తరణ చేయనున్నారని సమాచారం. అయితే తెలంగాణకు ఇప్పటికే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు. కొత్తగా చేపట్టబోయే కేబినెట్‌ విస్తరణలో మరో డిప్యూటీ సీఎం పదవి సృష్టించనున్నారని తెలుస్తోంది. మైనార్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి రెండో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. భట్టి దగ్గర కీలకమైన ఆర్థిక, విద్యుత్‌ శాఖలు ఉన్నాయి. ఇక రెండో డిప్యూటీ సీఎంకు హోంశాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇక ఏపీలో దేశంలోనే అత్యధికంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇద్దరేసి ఉప ముఖ్యమంత్రులున్నారు.

తెలంగాణ కేబినెట్‌లో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరు ఖాళీలను సామాజిక ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన ప్రొఫెసర్‌ కోదండరాంకు విద్యాశాఖ పోర్ట్‌ఫోలియో దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక కేబినెట్‌లోకి ముస్లిం అభ్యర్థిని చేర్చుకునే అవకాశం ఉంది. కోదండరాంతో పాటు ఎగువ సభకు నామినేట్ అయిన అమీర్ అలీ ఖాన్‌కు కేబినెట్‌లో చోటు దక్కుతుందని తెలుస్తోంది. రెండో డిప్యూటీ సీఎం పదవికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమీర్ అలీ ఖాన్‌కు ఆ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మైనార్టీ సామాజికవర్గం నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమానికి సలహాదారుగా నియమించారు. అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక రిటైర్డ్‌ ఇండియన్ పోస్టల్ సర్వీస్‌ అధికారి అమీర్‌ను TSPSC సభ్యునిగా నియమించారు. మళ్లీ మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. హైకమాండ్‌ను సంప్రదించిన తర్వాతే డిప్యూటీ సీఎంపై రేవంత్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పీసీసీని కూడా మారుస్తారని తెలుస్తోంది.

First Published:  27 Jan 2024 8:13 AM GMT
Next Story