Telugu Global
Telangana

తెలంగాణల భారీ వర్షాలు.. స్కూళ్లు, ఆఫీస్ లకు సెలవులు

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సిబ్బంది కూడా భారీ వర్షాల తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ లోని కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. శుక్ర, శనివారాలు సెలవులు ఇచ్చారు. ఆఫీస్ లు సోమవారం తెరుచుకుంటాయి.

తెలంగాణల భారీ వర్షాలు.. స్కూళ్లు, ఆఫీస్ లకు సెలవులు
X

తెలంగాణలో భారీ వర్షాలతో కొన్ని జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఏ చిన్న పనికోసం కూడా ప్రజలు ఇల్లు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితి సమీక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టారు. మరో రెండురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించారు. ఈమేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. GHMC పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రెండురోజులపాటు సెలవులు ఇవ్వాలని కార్మిక శాఖను ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రైవేటు కార్యాలయాలు కూడా సెలవులు ఇవ్వాలని సూచించారు.


గురు, శుక్రవారాలకు సంబంధించి ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. శనివారం కూడా పొడిగించారు. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి.. ఇక తెలంగాణలో సోమవారం స్కూల్స్ తెరుచుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సిబ్బంది కూడా భారీ వర్షాల తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ లోని కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. శుక్ర, శనివారాలు సెలవులు ఇచ్చారు. ఆఫీస్ లు కూడా సోమవారం తెరుచుకుంటాయి.

వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లపై భారీగా నీరు నిలిచి కొన్నిచోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా కొన్నిరూట్లలో రాకపోకలు ఆగిపోయాయి. ప్రత్యామ్నాయ రూట్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ నియంత్రించడానికి ప్రాణ నష్టం తప్పించడానికి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

బల్దియా చర్యలు..

ఇప్పటికే GHMC పరిధిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. చెట్లు పడిపోయినా వెంటనే తొలగిస్తున్నారు. నాళాల్లోకి నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల చెరువుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

First Published:  21 July 2023 12:58 AM GMT
Next Story