Telugu Global
Telangana

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్

ఇప్పటికే పోలీస్, వైద్యారోగ్య శాఖకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. దీనికి అదనంగా పాఠశాల విద్యా శాఖలో కూడా సీసీ సెంటర్ రాబోతున్నది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
X

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంత మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. బలహీనంగా ఉన్నారనే అంశాన్ని వైద్యారోగ్య శాఖ తేల్చాలి. కాగా, ఆ పిల్లలకు తగిన పోషకాహారం అందించేది మాత్రం పాఠశాల విద్యాశాఖ. అయితే పాఠశాల విద్యా శాఖ వద్ద తగిన సమాచారం లేకపోవడంతో చిన్నారులను రక్తహీనత బారి నుంచి బయట పడేసే మెనూను మధ్యాహ్న భోజన పథకంలో చేర్చలేకపోయారు. వైద్యారోగ్య, పాఠశాల విద్యా శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి సమస్య ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఈ క్రమంలో రెండు శాఖ మధ్య కోఆర్డినేషన్ కోసం పాఠశాల విద్యా శాఖలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పోలీస్, వైద్యారోగ్య శాఖకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. దీనికి అదనంగా పాఠశాల విద్యా శాఖలో కూడా సీసీ సెంటర్ రాబోతున్నది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సైఫాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ డైరెక్టరేట్ కార్యాలయం రెండో అంతస్థులో ఏర్పాటు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ సెంటర్ అందుబాటులోకి వస్తుంది.

రాష్ట్రంలో ఉన్న 42 వేలకు పైగా పాఠశాలలు, 62 లక్షల మంది విద్యార్థులపై ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 50 మంది సిబ్బంది పని చేయనున్నారు. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఈ సెంటర్‌ను రూపొందించారు. రియల్ టైం సర్వైలెన్స్ సిస్టమ్, ఉపాధ్యాయుల పని తీరు బేరీజు వేయడం, విద్యా ప్రమాణాలను మెరుగు పరిచే అధునాత వ్యవస్థను రూపొందించడం దీని లక్ష్యం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఈ నెల 20న ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. వారి హాజరును పర్యవేక్షించడానికి జీపీఎస్ ఆధారిత అటెండెన్స్ అమలు చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని సీసీ టీవీ కెమేరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం అవుతాయి. ఒక్కో విద్యార్థి సాధించిన ఫలితాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా మూల్యాంకనం చేసి.. ఏ సబ్జెక్టులో పేలవ ప్రదర్శన చేస్తున్నాడో గుర్తిస్తారు. ఇక ప్రతీ రోజు ఆన్‌లైన్ ద్వారానే టీచర్లు, విద్యార్థుల హాజరు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ఎన్ని సార్లు స్కూల్స్ మారాడో కూడా గుర్తిస్తారు. పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థి.. మరో స్కూల్‌లో జాయిన్ అయ్యే వరకు పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌, ఉచిత యూనిఫారాలు, పాఠ్యపుస్తకాల పంపిణీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తారు.

First Published:  11 Jun 2023 5:14 AM GMT
Next Story