Telugu Global
Telangana

జీహెచ్ఎంసీలో కలిసిపోనున్న కంటోన్మెంట్ బోర్డు.. మారనున్న సికింద్రాబాద్ స్వరూపం

దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులను సమీపంలోని స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

జీహెచ్ఎంసీలో కలిసిపోనున్న కంటోన్మెంట్ బోర్డు.. మారనున్న సికింద్రాబాద్ స్వరూపం
X

జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) విలీనానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో ఉన్న కంటోన్మెంట్లతో అతిపెద్దది సికింద్రాబాద్‌లోనే ఉన్నది. సికింద్రాబాద్‌కు నడి బొడ్డున ఉండటంతో చుట్టు పక్కల ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. బేగంపేట విమానాశ్రయం కారణంగా చాలా ఏళ్లు.. ఇప్పుడు ఆర్మీ ఆంక్షల కారణంగా కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎస్సీబీ వద్ద కూడా తగినన్ని నిధులు లేక.. రోడ్ల విస్తరణ, ఇతర మౌళిక సదుపాయాల కల్పన కూడా పెద్దగా జరగడం లేదు. ఇక ఎస్సీబీని ఆనుకొని ఉన్న జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా కొత్తగా రోడ్లు, ఫ్లైవోవర్లు నిర్మించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులను సమీపంలోని స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తమ అభిప్రాయం తెలియజేయాలని కూడా లేఖలు రాసింది. మధ్యప్రదేశ్‌లోని కంటోన్మెంట్ ఇప్పటికే దగ్గరలోని మున్సిపాలిటీలో కలిసిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీబీని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే తమ అంగీకారాన్ని తెలియజేస్తూ కేంద్రానికి, రక్షణ శాఖకు లేఖలు రాయనున్నారు.

జీహెచ్ఎంసీలో ఎస్సీబీ విలీనం జరిగితే దాదాపు 3వేల ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ బల్దియా పరం అవుతుంది. ఎస్సీబీ పరిధిలోని పార్కులు, వాటర్ రిజర్వాయర్లు, తోటలు, ఎస్సీబీ ఉద్యోగుల క్వార్టర్లు, వర్క్ షాపులు, ఇతర ఖాళీ స్థలాలు అన్నీ జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వస్తాయి. ఇది జంటనగరాల్లోని నడిబొడ్డున ఉండటంతో మార్కెట్ విలువ కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏ-1గా పేర్కొనే డిఫెన్స్ ల్యాండ్ మినహా.. భవిష్యత్ అవసరాలకు కోసం ఆర్మీ ఉంచుకున్న ఖాళీ స్థలాలు (ఏ-2), కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలం (బీ-1), ప్రైవేట్ ల్యాండ్ (బీ-2), మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు లీజ్‌కు ఇచ్చిన ల్యాండ్ (బీ-3), కంటోన్మెంట్ పరిధిలోని డిఫెన్స్ స్పెషల్ ల్యాండ్ (బీ-4), కంటోన్మెంట్ బోర్డు అవసరాలకు కోసం ఉపయోగిస్తున్న ల్యాండ్ (సీ), సివిల్ ఏరియా ( మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు లీజ్‌కు ఇచ్చిన ల్యాండ్) మొత్తం జీహెచ్ఎంసీకి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది.

ఎస్సీబీ అధికారిక లెక్కల ప్రకారం కంటోన్మెంట్ బోర్డు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. అంటే అది దాదాపు 9వేల ఎకరాలు దీని పరిధిలోకి వస్తుంది. దీనిలో 27.5 శాతం బీ-2 కిందకు వస్తుంది. ఈ 3వేల ఎకరాలను బదిలీ చేయడంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ఎస్సీబీ ట్రాన్స్‌ఫర్ ల్యాండ్‌లో జీహెచ్ఎంసీ ఫ్లైవోర్లు, స్కైవేలు, ఫుట్‌ ఓవర్ బ్రిడ్జీలు, ట్రాఫిక్ జంక్షన్లు, ఇతర మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవు.

ఎస్సీబీ కనుక జీహెచ్ఎంసీలో విలీనం అయితే.. సికింద్రాబాద్ ప్రాంతంలో పూర్తిగా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగు పరచడానికి కొత్త రోడ్లు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. భారీ కట్టడాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయి. రియాల్టీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇన్నాళ్లూ.. ఎస్సీబీ, జీహెచ్ఎంసీ మధ్య ఉన్న పలు వివాదాలకు కూడా తెరపడుతుందని చెబుతున్నారు. ఇది హైదరాబాద్ మహా నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

First Published:  30 Dec 2022 3:36 AM GMT
Next Story