Telugu Global
Telangana

బ్యాంకు సిబ్బంది చేతివాటం - అకౌంట్‌ నుంచి రూ.14 లక్షలు మాయం

బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై స్థానిక సర్పంచ్‌ భర్త కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం బయటికి వెలుగుచూసింది.

బ్యాంకు సిబ్బంది చేతివాటం  - అకౌంట్‌ నుంచి రూ.14 లక్షలు మాయం
X

స్టేట్‌బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఒక ఘటనలో ఒక వ్యక్తి ఖాతా నుంచి రూ.14 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకోగా.. మరో ఘటనలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడానికి వచ్చిన మహిళకు నకిలీ బాండ్‌ ఇచ్చి రూ.4 లక్షలకు మోసం చేశారు. మంగళవారం ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విస్మయం కలిగించే ఈ ఘటనలకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌కు అచ్చంపేట పట్టణంలోని స్టేట్‌ బ్యాంకు బ్రాంచిలో ఖాతా ఉంది. అందులో రూ.14.73 లక్షలు ఉన్నాయి. లక్ష రూపాయలు నగదు అవసరమైన వినోద్‌కుమార్‌ సెప్టెంబరు 29న బ్యాంకుకు వెళ్లి డబ్బు డ్రా చేసేందుకు యత్నించాడు. అయితే విత్‌డ్రాయల్‌ ఫారం చూసి అతని ఖాతాను పరిశీలించిన సిబ్బంది అంత మొత్తం లేదని చెప్పడంతో ఒక్కసారిగా విస్తుపోయాడు. దీనిపై సెప్టెంబర్‌ 30న బ్యాంకు మేనేజర్‌కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన బ్యాంకు అధికారులు వినోద్‌కుమార్‌ ఖాతా నుంచి రూ.14 లక్షలు బ్యాంకులో పనిచేసే ఒక వ్యక్తి అకౌంట్‌కు బదిలీ అయినట్టు గుర్తించారు. ఆ సొమ్మును సెప్టెంబర్‌ 5న ఒకసారి రూ.6 లక్షలు, మరోసారి రూ.5 లక్షలు, 6న మరో రూ.3 లక్షలు చొప్పున బదిలీ చేసినట్టు వారి పరిశీలనలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, సొమ్ము ఖాతాలో జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన అధికారులు.. ఆ తర్వాత స్పందించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై స్థానిక సర్పంచ్‌ భర్త కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం బయటికి వెలుగుచూసింది. తమ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో మంచాన పడ్డాడని, వైద్య ఖర్చుల కోసం తక్షణమే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిబ్బంది ఈ సమాచారాన్ని సెలవులో ఉన్న బ్రాంచి మేనేజర్‌ హుసేన్‌ బాషా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఫోనులో బాధితులతో మాట్లాడారు. ఓ ఉద్యోగి పొరపాటు చేసిన మాట వాస్తవమేనని.. విచారణ కొనసాగుతోందని, న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే.. నకిలీ బాండ్‌ ఇచ్చారు..

అచ్చంపేట ఎస్‌బీఐ బ్రాంచిలోనే మరో మోసం చోటుచేసుకుంది. రూ.4 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మహిళకు నకిలీ బాండ్‌ ఇచ్చి మోసగించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామ వాసి శ్రీనివాసులు మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి రైతు బీమా పరిహారం రూ.5 లక్షలు మంజూరైంది. అందులో రూ.4 లక్షలను అతని భార్య అనిత మే 2న అచ్చంపేట ఎస్‌బీఐ బ్రాంచిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఆ మేరకు బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఒకరు ఆమెకు బాండ్‌ పత్రాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొంత నగదు అవసరం కావడంతో ఆ బాండు తనఖా పెట్టి రుణం తీసుకోవాలని సెప్టెంబర్‌ 15న బ్యాంకుకు వెళ్లిన అనితకు షాకింగ్‌ విషయం తెలిసింది. ఆ బాండ్‌ నకిలీదని సిబ్బంది తెలిపారు. దీంతో కన్నీటిపర్యంతమైన మహిళ.. దీనిపై బ్యాంకు మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై విచారించి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంపై బాధితురాలు మంగళవారం బ్యాంక్‌కు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు.

First Published:  4 Oct 2023 5:57 AM GMT
Next Story