Telugu Global
Telangana

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సానియా మీర్జా.. ఆ స్థానం నుంచే పోటీ..!

హైద‌రాబాద్ స్థానానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అయితే బాగుంటుంద‌ని కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ ప్ర‌తిపాదించారు. అజార్‌కు సానియాతో బంధుత్వం కూడా (సానియా సోద‌రి అజార్ కోడ‌లు) ఉంది.

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సానియా మీర్జా.. ఆ స్థానం నుంచే పోటీ..!
X

తెలంగాణ‌లో కాంగ్రెస్ త‌ర‌ఫున లోక్‌స‌భ‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల లిస్ట్ దాదాపు ఖ‌రార‌యింది. ఈ రోజు ఢిల్లీలో జ‌రిగే కాంగ్రెస్ సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశంలో చ‌ర్చించి, దీనికి ఆమోద‌ముద్ర వేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ లిస్ట్‌లో అనూహ్యంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ఉండొచ్చ‌ని విశ్వ‌సనీయంగా తెలుస్తోంది. హైద‌రాబాద్ ఎంపీ స్థానానికి సానియా మీర్జా పేరును కాంగ్రెస్ సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తోంది.

ఇప్ప‌టికే 9 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మిగిలిన 8 స్థానాలపై క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. అయితే ఇందులో హైద‌రాబాద్ స్థానానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అయితే బాగుంటుంద‌ని కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ ప్ర‌తిపాదించారు. అజార్‌కు సానియాతో బంధుత్వం కూడా (సానియా సోద‌రి అజార్ కోడ‌లు) ఉంది. ఈ నేప‌థ్యంలో అజార్‌తో స‌హా కాంగ్రెస్ నేత‌లు సానియాను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.

ముస్లిం అభ్య‌ర్థి.. టెన్నిస్ గ్లామ‌ర్ క‌లిసొస్తుంద‌ని

1977, 1980 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు చెందిన కె.ఎస్‌.నారాయ‌ణ హైద‌రాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత ఓవైసీ కుటుంబానిదే హవా. ఆరుసార్లు సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ, ఆ త‌ర్వాత ఆయ‌న పెద్ద‌కుమారుడు అస‌దుద్దీన్ ఓవైసీ నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎంఐఎం పార్టీకి చెందిన అస‌దుద్దీన్‌కి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని కాంగ్రెస్ సానియా మీర్జాను బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంది. ముస్లిం అభ్య‌ర్థి, అందునా టెన్నిస్ గ్లామ‌ర్ క‌లిసొస్తే అస‌దుద్దీన్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వొచ్చ‌న్న‌ది హ‌స్తం పార్టీ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

First Published:  27 March 2024 7:10 AM GMT
Next Story