Telugu Global
Telangana

సేమ్ టు సేమ్.. ఓటుకునోటు గుర్తుకొస్తోందా..?

అంటే అప్పుడైనా, ఇప్పుడైనా జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలే. అప్పట్లో బేరంచేసింది టీడీపీ అయితే.. ఇప్పుడు బీజేపీ. అప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు నలుగురు ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు.

సేమ్ టు సేమ్.. ఓటుకునోటు గుర్తుకొస్తోందా..?
X

మొయినాబాద్ శివార్లలోని అజీజ్ నగర్ ఫాంహౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల బేరాలు సంచలనం సృష్టిస్తోంది. జరిగిన ఘటన, పోలీసుల మెరుపు దాడి, వ్యక్తులు పట్టుబడిన విధానం చూస్తుంటే అచ్చంగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓటుకు నోటు వ్యవహారం గుర్తుకొస్తోంది కదూ. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది దాదాపు సేమ్ టు సేమ్ సీన్. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్లు సేమ్ టు సేమ్. వ్యక్తులు మారారు, తేదీలు మారాయి, పాత్రదారులు మారారంతే.

అజీజ్ నగర్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు న‌లుగురు.. గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధనరెడ్డి, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డితో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఫాంహౌస్ పై దాడిచేసి బేరాలాడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, పదవులు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు.

పోలీసుల దాడి తర్వాత ఎమ్మెల్యేలు ఫాంహౌస్ నుండి వెళ్ళిపోయారు. బాలరాజు మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనకు తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఒక ఫ్రెండ్ పిలిస్తేనే ఫాంహౌస్ కు వచ్చినట్లు చెప్పారు. సరే పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు కాబట్టి దర్యాప్తులో అన్నీ విషయాలు తెలుస్తాయి. అచ్చంగా 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బయటపడిన ఓటుకు నోటు ఘటన గుర్తుకొస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కొనేందుకు చంద్రబాబు నాయుడు రు. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

బేరంలో భాగంగా అడ్వాన్స్ రూ. 50 లక్షలు ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ ఇంటికి వెళ్ళి పట్టుబడ్డారు. అప్పట్లో కూడా స్టీఫెన్ ఏసీబీ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ ను డబ్బు సంచుల‌తో పట్టుకున్నారు. ఇప్పుడు టేబుల్ మీద డబ్బు కనబడలేదు కానీ బేరాలు జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

అంటే అప్పుడైనా, ఇప్పుడైనా జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలే. అప్పట్లో బేరంచేసింది టీడీపీ అయితే.. ఇప్పుడు బీజేపీ. అప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు నలుగురు ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు. అప్పుడు దాడిచేసి పట్టుకుంది ఏసీబీ పోలీసులు అయితే.. ఇప్పుడు రెగ్యులర్ పోలీసులు. అప్పుడు పట్టుబడింది టీడీపీ ఎమ్మెల్యేలు అయితే.. ఇప్పుడు పట్టుబడింది స్వామీజీలు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో మీమ్స్ తెగ‌చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నాటి ఓటుకు నోటు సంఘ‌ట‌న‌ను.. నేటి ఎమ్మెల్యేల కొనుగోలు విఫ‌ల‌య‌త్న ఘ‌ట‌న‌ను పోల్చుతూ ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు.

First Published:  27 Oct 2022 3:50 AM GMT
Next Story