Telugu Global
Telangana

గ్రేటర్ లో మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్..

ఇనుముతో గట్టిగా ఉండేలా గ్రిల్స్ పెట్టారు. ఎంత బరువైన వ్యక్తి ఈ గ్రిల్స్ పై పడినా కూడా అవి లోపలికి వెళ్లవు, వంగిపోవు. మ్యాన్ హోల్ దుర్ఘటనలకు ఇది పర్మినెంట్ సొల్యూషన్ అంటున్నారు అధికారులు.

గ్రేటర్ లో మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్..
X

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 22వేల మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటిపై రెడ్ మార్క్ కూడా వేశారు. అంతే కాదు, అవసరమైన చోట సైన్ బోర్డ్ లు కూడా ఏర్పాటు చేశారు. మ్యాన్స్ హోల్స్ ఉన్నాయి జాగ్రత్త అంటూ బోర్డులు పెట్టారు.

ఎందుకీ హడావిడి..?

ఇటీవల భారీ వర్షాలకు కూకట్ పల్లి ప్రగతి నగర్ లో వరదనీరు సాఫీగా పోయేందుకు మ్యాన్ హోల్ మూతను స్థానికులు తీసివేశారు. అదే సమయంలో నాలుగేళ్ల బాలుడు అటువైపుగా వెళ్తూ మూతలేని మ్యాన్ హోల్ లో పడిపోయి దుర్మరణంపాలయ్యాడు. ఈ ఘటన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దుర్ఘటనలు జరక్కుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్స్ మూతల కింద గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఇనుముతో గట్టిగా ఉండేలా గ్రిల్స్ పెట్టారు. ఎంత బరువైన వ్యక్తి ఈ గ్రిల్స్ పై పడినా కూడా అవి లోపలికి వెళ్లవు, వంగిపోవు. మ్యాన్ హోల్ దుర్ఘటనలకు ఇది పర్మినెంట్ సొల్యూషన్ అంటున్నారు అధికారులు.

మ్యాన్‌ హోల్స్‌ వద్ద సమస్యలు ఉంటే జలమండలి, జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ లైన్‌ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బందే స్వయంగా వచ్చి సమస్య పరిష్కరిస్తారని, స్థానికులెవరైనా అనాలోచితంగా మ్యాన్‌ హోల్స్‌ మూతలు తీస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వర్షాల సమయంలో సహాయక చర్యలకోసం..

వర్షాల సమయంలో సహాయక చర్యలకోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మాన్ సూన్ సేఫ్టీ టీమ్, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ వాహనాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు కూడా అందించారు. వర్షపు నీటిని తోడిపోసే పరికరాలతోపాటు, సిల్ట్ తొలగించే ఏర్పాట్లు కూడా ఈ వాహనాల్లో ఉంటాయి. మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. మ్యాన్ హోళ్ల సమస్యల పరిష్కారం కోసం జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు అధికారులు.

First Published:  11 Sep 2023 3:14 PM GMT
Next Story