Telugu Global
Telangana

MGNREGS గ్రామీణ ఉపాధి హామీ పథ‌కం: కేంద్రం బెదిరింపులతో నిర్వీర్యం

MGNREGS కింద పనిచేస్తున్న కార్మికుల హాజరును డిజిటల్ క్యాప్చర్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య చేపడుతున్నట్టు చెప్పుకుంది. అయితే ఫీల్డ్ సూపర్‌వైజర్‌లకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, సాంకేతిక, లాజిస్టికల్ మద్దతు లేకపోవడం, చాలా గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వంటి అనేక లోపాలు ఉన్నప్పటికీ తమ ఆదేశాలు అమలు చేయకపోతే పథకం ఆపేస్తామని బెదిరిస్తోంది కేంద్రం.

MGNREGS గ్రామీణ ఉపాధి హామీ పథ‌కం: కేంద్రం బెదిరింపులతో నిర్వీర్యం
X

కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రాలను అనేక‌ ఇబ్బందులకు గురి చేస్తోంది. సరిగ్గా చెప్పాలంటే రాచి రంపాన పెడుతోంది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలైతే సవతి తల్లికన్నా అన్యాయంగా ఉన్నాయి.

తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను మళ్లించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. ఆ ప్రచారం పై రాష్ట్ర ప్రభుత్వం నిరసన గొంతు వినపించగానే ఇప్పుడు మరో కొత్త ఆదేశంతో బెదిరింపులకు దిగుతోంది. ఆ ఆదేశాలను జనవరి 1 నుండి అమలు చేసి తీరాలని హుకుం జారీ చేసింది.

MGNREGS కింద పనిచేస్తున్న కార్మికుల హాజరును డిజిటల్ క్యాప్చర్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య చేపడుతున్నట్టు చెప్పుకుంది. అయితే ఫీల్డ్ సూపర్‌వైజర్‌లకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, సాంకేతిక, లాజిస్టికల్ మద్దతు లేకపోవడం, చాలా గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వంటి అనేక లోపాలు ఉన్నప్పటికీ తమ ఆదేశాలు అమలు చేయకపోతే పథకం ఆపేస్తామని బెదిరిస్తోంది కేంద్రం,

''పనులు చేసే కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని వర్క్ సైట్‌లు మొబైల్ యాప్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్)లో హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని కేంద్రం ఆదేశం చెబుతోంది. దీని కోసం రోజుకు రెండుసార్లు కార్మికుల యొక్క టైమ్ స్టాంప్, జియో-ట్యాగ్ చేసిన ఫోటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అవినీతి, జవాబుదారీతనం, మస్టర్‌ రోల్స్‌లో డూప్లికేషన్‌ వంటి సమస్యలను పేర్కొంటూ కేంద్రం గతేడాది మే 16న ఈ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక లోపాలతో సహా అనేక సమస్యలను రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తెచ్చినప్పటికీ, సమస్యలను పరిష్కరించకుండా , దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించుకుంది.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి వ్యక్తికి అత్యధిక పనిదినాలు నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో రూపొందించిన వ్యక్తిగత పనిదినాల విషయానికొస్తే, తెలంగాణ ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 9.92 కోట్ల పనిదినాలు సృష్టించింది. ఇప్పుడు కేంద్రం తాజా ఆదేశం మొత్తం వ్యక్తి పని దినాలపై ప్రభావం చూపుతుందని అధికారులు భయపడుతున్నారు.

“యాప్ వినియోగానికి సంబంధించిన అనేక సాంకేతిక, సామాజిక సమస్యలను మేము గుర్తించి కేంద్రానికి తెలియజేశాము. ఈ కొత్త ఆదేశాల వల్ల MGNREGS పనులకు కార్మికులు రారనే భయం మాకుంది. ఇది రాష్ట్రంలో ఆ పథకం అమలుపై తీవ్ర ప్రభావం వేస్తుంది. ” అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు అన్నారు.

అధికారులు చెప్తున్న దాని ప్రకారం, మస్టర్ రోల్స్‌లో నకిలీ హాజరును తనిఖీ చేయడానికి వర్క్‌సైట్‌లో కార్మికుల జియో-ట్యాగ్ , టైమ్-స్టాంప్ ఫోటోగ్రాఫ్‌లను రోజుకు రెండుసార్లు తీయాలి. అయితే, దీని కోసం కార్మికులు ఫోటో తీసే వరకు వర్క్‌సైట్‌లో ఉండాలి. సరైన‌న ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం, సాంకేతిక లోపాలు పైలట్ ప్రాజెక్ట్ సమయంలోనే కార్మికులను పనులకు రాకుండా చేశాయి.

ఇంకా, వర్క్‌సైట్‌లలో తీసిన వందలాది మంది కార్మికుల ఫోటోలను రోజూ వారి జాబ్ కార్డ్‌లలో ఉన్న వారితో సరిపోల్చడానికి అవసరమైన సిబ్బంది, అధికారులు మనకు లేరు. ఇలా చేయడం క్లిష్టతరమే కాదు అసాధ్యం కూడా అని అధికారులు చెప్తున్నారు. MGNREG చట్టం అసలు లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ ఆదేశాలున్నాయి. కార్మికులు ఎక్కువ‌ గంటల పాటు పని చేయవలసి వస్తుంది.

ఈ యాప్ పూర్తిగా ఆంగ్లంలో రూపొందించబడింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక సహాయం అందించడంలేదు. హాజరు నమోదు కావడంలో సాంకేతిక లోపం తలెత్తితే కార్మికులు ఇంటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.

కాగా MGNREGS పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను (కళ్ళాలు)నిర్మించింది. దానిని వ్యతిరేకించిన కేంద్రం 151.9 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చేయాలని గత ఏడాది చివర్లో నోటీసు జారీచేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అనేక రాష్ట్రాలకు చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం రైతులకు పంటలను ఎండబెట్టే కళ్ళాల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న క్రమంలోనే కొత్తగా కేంద్రం కార్మికుల హాజరును డిజిటల్ క్యాప్చర్ చేయాలని ఆదేశాలివ్వడం తెలంగాణపై ప్రతీకార చర్యగా అధికారులు చెప్తున్నారు.

First Published:  5 Jan 2023 6:17 AM GMT
Next Story