Telugu Global
Telangana

ఒక్క నిబంధన కూడా పాటించలేదు.. రూబీ ఎలక్ట్రిక్ షోరూం ఘటనలో రిపోర్ట్ విడుదల

మూడు పేజీల ఈ రిపోర్ట్‌లో అనేక కీలకమైన విషయాలను అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి పూర్తి కారణం బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యమే అని నివేదికలో స్పష్టం చేశారు.

ఒక్క నిబంధన కూడా పాటించలేదు.. రూబీ ఎలక్ట్రిక్ షోరూం ఘటనలో రిపోర్ట్ విడుదల
X

రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రిక్ షోరూం బ్యాటరీ చార్జింగ్ పాయింట్ వద్ద మొదలైన మంటలు ఆ బిల్డింగ్ పైన ఉన్న లాడ్జీకి కూడా వ్యాపించి తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీశాయి. ఈ ఘటనపై తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల ఈ రిపోర్ట్‌లో అనేక కీలకమైన విషయాలను అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి పూర్తి కారణం బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యమే అని నివేదికలో స్పష్టం చేశారు. లిథియం బ్యాటరీలు పేలడం వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని.. పొగ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఫైర్ సిబ్బంది వెంటనే లోపలకు వెళ్లలేక పోయాయని పేర్కొన్నారు.

భవనం మొత్తానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉన్నాయని.. లిఫ్ట్ పక్కనే మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధనను యజమాని తుంగలో తొక్కినట్లు నివేదికలో పేర్కొన్నారు. భవనంలో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. కానీ అవి సమయానికి పని చేయలేదని అధికారులు తెలిపారు. భవనం మొత్తం చాలా ఇరుకుగా, క్లోజ్డ్ సర్క్యూట్‌లో ఉండటం వల్ల ఎవరూ బయటకు రాలేకపోయారని పేర్కొన్నారు. భవనానికి ఎలాంటి కారిడార్ లేదని.. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కనిపించలేదని అధికారులు తెలిపారు. ముందుగా సెల్లార్‌లో మంటలు చెలరేగి.. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వ్యాపించాయని రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. ఒక్క నిబంధన కూడా పాటించకుండా భవనంలో షోరూం, లాడ్జి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం ఉన్న భవనం పైన లాడ్జి కూడా ఉన్నది. రూబీ హోటల్‌లో మొత్తం నాలుగు ఫ్లోర్లలో 23 రూమ్స్ ఉన్నాయి. సెల్లార్‌లో ఉన్న బైక్ షోరూంలో మంటలు చెలరేగి పైన ఉన్న రెండు ఫ్లోర్లకు వ్యాపించాయి. దీంతో ఎనిమిది మంది ఊపిరాడక చనిపోయారు. మంటలు వ్యాపించడంతో భవనం పై నుంచి దూకిన వారు ఎవరూ చనిపోలేదు. అయితే వారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఘటనను పరిశీలించిన పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్.. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద తీవ్రత పెరిగిందని రిపోర్టు విడుదల చేసింది.

First Published:  14 Sep 2022 3:22 AM GMT
Next Story