Telugu Global
Telangana

ముస్లింలు ర్యాలీ నిర్వహించే రోజే భైంసాలో ర్యాలీ నిర్వహిస్తామన్న ఆరెస్సెస్ -అక్కడే ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు

ప్రభుత్వం తరపు న్యాయవాది సామల రవీందర్ తన వాదనలను వినిపిస్తూ ఇప్పటి వరకు పోలీసులు అనుమతి నిరాకరించలేదని, అయితే భైంసా సున్నితమైన ప్రాంతమైనందున గతంలో కూడా బీజేపీ అక్కడ నిర్వహిస్తామన్న సభకు హైకోర్టు అనుమతి నిరాకరించిందన్న విషయాన్ని కోర్టుకు గుర్తు చేశారు.

ముస్లింలు ర్యాలీ నిర్వహించే రోజే భైంసాలో ర్యాలీ నిర్వహిస్తామన్న ఆరెస్సెస్ -అక్కడే ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు
X

మతపరంగా సున్నిత ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసాలో ముస్లింలు షబ్‌-ఇ-బరాత్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ నెల 19న తమకు కూడా అక్కడే ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఆరెస్సెస్ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ రోజు తమ రూట్ మార్చ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ఆరెస్సెస్ కోర్టును కోరింది. అయితే హైకోర్టు ఆరెస్సెస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

తాము అనుమతికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ, అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించాలనికోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు.

దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది సామల రవీందర్ తన వాదనలను వినిపిస్తూ ఇప్పటి వరకు పోలీసులు అనుమతి నిరాకరించలేదని, అయితే భైంసా సున్నితమైన ప్రాంతమైనందున గతంలో కూడా బీజేపీ అక్కడ నిర్వహిస్తామన్న సభకు హైకోర్టు అనుమతి నిరాకరించిందన్న విషయాన్ని కోర్టుకు గుర్తు చేశారు.

అదే రోజు ముస్లింలు షబ్‌-ఇ-బరాత్‌ ర్యాలీ నిర్వహిస్తారని అందువల్ల ఆరెస్సెస్ ర్యాలీకి అనుమతి ఇస్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నదని న్యాయవాది రవీందర్ వివరించారు.

దీనిపై హైకోర్టు స్పందిస్తూ భైంసాలోనే ఎందుకు ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నారని అరెస్సెస్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఆరోజు కాకపోతే మరో తేదీన భైంసాలోనే ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతి ఇస్తారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

First Published:  18 Feb 2023 4:14 AM GMT
Next Story