Telugu Global
Telangana

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణకు రూ.7,218 కోట్ల పెట్టుబడులు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా.. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణకు రూ.7,218 కోట్ల పెట్టుబడులు
X

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఒకే రోజు రూ.7,217.95 కోట్ల పెట్టుబడులను సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్‌లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి 27 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల దాదాపు 60 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫుడ్ కాంక్లేవ్‌లో టీఎస్ ఆయిల్ ఫెడ్ అత్యధిక పెట్టుబడులు సాధించింది. శనివారం హైటెక్స్‌లో జరిగిన ఫుడ్ కాంక్లేవ్-23ని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆయిల్ ఫెడ్ దాదాపు రూ.1,055 కోట్ల పెట్టుబడులు సాధించడం ద్వారా.. దాదాపు 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నది. మరో వైపు పతంజలి సంస్థ రూ.1,050 కోట్ల పెట్టుబడులతో 3 వేల మందికి ఉపాధి ఇవ్వనున్నది.

ఫుడ్ కాంక్లేవ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా.. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మారిందని అన్నారు. ఈ ఫుడ్ కాంక్లేవ్ కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ ఏటా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఫుడ్ కాంక్లేవ్‌లో భాగంగా 20కి పైగా గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయని.. ఇందులో వందకు పైగా కంపెనీల సీఈవోలు, నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెలు, వంట నూనెల ఉత్పత్తి వంటి ఐదు రంగాలకు సంబంధించిన చర్చలు చేస్తారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా, పౌల్ట్రీ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి ఇన్‌లాండ్‌ ఫిషరీష్‌ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. గొర్రెలు, మేకల సంఖ్యలో దేశంలో మొదటి రాష్ట్రంగా, డెయిరీ ఇండస్ట్రీలో నాయకత్వ హోదాని సొంతం చేసుకున్నదని వివరించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణకు ఐదేళ్లలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. కోకాకోలా, ఐటీసీ, పెప్సీకో, మార్స్‌, హాట్సన్‌ తదితర ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, ఎనిమిదేళ్లలో అనేక బహుళజాతి సంస్థలు, జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొన్నాయని చెప్పారు.


First Published:  30 April 2023 3:32 AM GMT
Next Story