Telugu Global
Telangana

సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్, వికలాంగులకు రూ.4,116 పెన్షన్ : మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్

తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి నడక, స్టైల్ మారిందని కేసీఆర్ చెప్పారు. 2014లో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు ఉండగా.. ఇవ్వాళ రూ.33 వేల కోట్లకు చేరిందని అన్నారు.

సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్, వికలాంగులకు రూ.4,116 పెన్షన్ : మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ మంచిర్యాల పర్యటనలో రెండు శుభవార్తలు చెప్పారు. ప్రతీ ఏడాది దసరా సమయంలో ఇచ్చే బోనస్ విషయంలో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సింగరేణి కార్మికులందరికీ కలిపి రూ.700 కోట్ల బోనస్ అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెల నుంచి వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.4,116 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో శుక్రవారం సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం రాక ముందు సింగరేణిలో ఇచ్చే బోనస్ 18 శాతం మాత్రమే ఉండేదని చెప్పారు. అప్పట్లో కేవలం రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మాత్రమే కార్మికులకు పంచేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి నడక, స్టైల్ మారిందని కేసీఆర్ చెప్పారు. 2014లో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు ఉండగా.. ఇవ్వాళ రూ.33 వేల కోట్లకు చేరిందని అన్నారు. ఆనాడు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల లాభాలు వచ్చేవి. కాని ఇవాళ సింగరేణి లాభాలు రూ.2,184 కోట్లకు చేరుకున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఒకనాడు సింగరేణి లాభాలకు మించి.. నేడు బోనస్ అందుకోబోతున్నామని కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. కాంగ్రెస్ పాలనతో సింగరేణిలో కేవలం 6,543 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును కూడా పునరుద్దరించి మొత్తం 19,463 ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. సింగరేణిలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోతే రూ.1 లక్ష ఇచ్చి అప్పటి పాలకులు చేతులు దులుపుకునే వారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తోందని అన్నారు.

సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి వడ్డీలేని రుణం రూ.10 లక్షలు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే సింగరేణికి సంబంధించిన స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న చాలా మంది పేదలకు క్రమబద్దీకరించి పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ వివరించారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇది తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. ఎన్నో లక్షల మందికి ఇది అన్నం పెట్టింది.. పెడుతోందని కేసీఆర్ అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి అప్పలు తీసుకొని వచ్చి.. వాటిని చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్రానికి రాసిచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు.

ఇక సింగరేణికి గనులు కేటాయించమని కోరితే కేంద్రంలోని బీజేపీ టెండర్లలో పాల్గొనమని హితవు పలుకుతోందని అన్నారు. సింగరేణిని కేవలం బొగ్గు వెలికితీతకే పరిమితం చేయకుండా.. రాబోయే రోజుల్లో ఇతర ఖనిజాల తవ్వకాలను కూడా చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న సింగరేణి.. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది.. భారీగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థగా మారుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

వికలాంగులకు రూ.4,116 పెన్షన్..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వికలాంగులకు ఇస్తున్న రూ.3,116 పెన్షన్‌ను రూ.4,116కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో టెన్షన్ లేకుండా ఉన్నారు. ఇక దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న శుభ సమయంలో, ఈ రోజు మంచి రోజని వికలాంగుల పెన్షన్ పెంపును ప్రకటిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. మంచిర్యాల గడ్డ నుంచి, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలనే ఇన్ని రోజులు సస్పెన్స్‌లో పెట్టానని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలా మాట్లాడే వారినే ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ధరణి ఉండబట్టే ఈ రోజు రైతు బంధు, రైతు బీమా సకాలంలో అందుతున్నాయి. ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల్లోపే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు అందుతున్నాయని కేసీఆర్ చెప్పారు. రైతులు భూములు అమ్మాలన్నా, కొనాలన్నీ కేవలం 10 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని.. అది ధరణి వల్లే సాధ్యమైందని కేసీఆర్ చెప్పారు.

మంచిర్యాల జిల్లా అనేది ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసుల కల అని చెప్పారు. ఇవ్వాళ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడమే కాకుండా.. కొత్త మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ఒకనాడు ఈ ప్రాంతం గుండా వెళ్తే గోదావరిలో రూపాయి నాణేలు వేసి కరుణించు గోదారమ్మా అని మొక్కుకునే వాడిని. అప్పట్లో నదిలో నీళ్లు కనపడటం గగనమైంది. కానీ ఈ రోజు 250 కిలోమీటర్లు మేర గోదావరి జలాలతో కళకళలాడుతోందని చెప్పారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తయితే.. మరింత ఆయకట్టుకు నీరందుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశమంతా తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటున్నది. అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాను. మీరు కూడా ఈ బిడ్డను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.

First Published:  9 Jun 2023 2:47 PM GMT
Next Story