Telugu Global
Telangana

మీరు గేట్లు తెరిస్తే గొర్రెలు.. మేం గేట్లు తెరిస్తే సింహాలు

రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్నారు.

మీరు గేట్లు తెరిస్తే గొర్రెలు.. మేం గేట్లు తెరిస్తే సింహాలు
X

మేం గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కౌంటరిచ్చారు. మీరు గేట్లు తెరిస్తే అక్కడికి గొర్రెలు వచ్చాయి, అదే బీఆర్‌ఎస్‌ పార్టీ గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయన్నారు. నిజమైన తెలంగాణ వాళ్లు ఇక్కడ ఉంటే.. తెలంగాణను మోసం చేసిన వాళ్లు అక్కడ ఉన్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్లంతా అక్కడికి గేట్లు తోసుకుని పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్నారు. రాజ్యాంగం రద్దయితే తమకు రిజర్వేషన్లు ఉండవని.. దళిత బిడ్డల బతుకు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ఆర్‌ఎస్పీ.

రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆపనని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

First Published:  24 March 2024 4:03 AM GMT
Next Story