Telugu Global
Telangana

కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి... రూ.500 కోట్లు కేటాయించిన కేంద్రం

తెలంగాణలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 2023-24 బడ్జెట్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 6,612.44 కోట్లు ప్రతిపాదించింది. అయితే రూ. 500 కోట్లు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రాంట్ల నివేదికలో వెల్లడించింది.

కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి... రూ.500 కోట్లు కేటాయించిన కేంద్రం
X

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల, నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం మధ్య కృష్ణా నదిపై కేబుల్-స్టేడ్-కమ్-సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.1,082.56 కోట్లు. ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 30 నెలల సమయం పడుతుంది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం 80 కిలోమీటర్ల మేర తగ్గుతుంది.

తెలంగాణలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 2023-24 బడ్జెట్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 6,612.44 కోట్లు ప్రతిపాదించింది. అయితే రూ. 500 కోట్లు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రాంట్ల నివేదికలో వెల్లడించింది. కృష్ణా నదిపై నాలుగు లేన్ల క్యారేజ్‌వేతో రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్థిక స్టాండింగ్ కమిటీ గత ఏడాది ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత సోమశిల-సిద్దేశ్వరం వంతెన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆత్మకూర్‌ మధ్య రోడ్డు మార్గంలో దాదాపు 175 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లే వారు కర్నూలు మీదుగా వెళ్ళాల్సిన అవసరం ఉండ‌దు.

రాష్ట్ర రోడ్లు, భవనాల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ ఐకానిక్ బ్రిడ్జి పూర్తయ్యాక‌, హైదరాబాద్ నుండి తిరుపతి మధ్య దూరం 80 కి.మీ తగ్గుతుంది. దూరాన్ని తగ్గించడంతో పాటు, నల్లమల పరిధిలోని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌పై ఉన్న సుందరమైన ప్రదేశం వల్ల ఈ వంతెన పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఈ వంతెన గాజుతో కూడిన పాదచారుల నడక మార్గం, ఆలయ గోపురం లాంటి పైలాన్‌లు, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషనల్ స్పాన్ వంటి అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ బ్రిడ్జి చుట్టూ నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, విశాలమైన శ్రీశైలం రిజర్వాయర్...ఇలా అనేక అందమైన ప‌రిసరాలు ఉంటాయని అధికారులు వివరించారు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి రూ. 50 కోట్లు మంజూరు చేశారు. అయితే 2009 ఎన్నికల కారణంగా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జి ప్లాన్‌కు ఆమోదం తెలిపి రూ.190 కోట్లు మంజూరు చేసి తమ వంతుగా నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అది కాగితాల్లోనే మిగిలిపోయింది.

First Published:  20 Feb 2023 12:01 PM GMT
Next Story