Telugu Global
Telangana

ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు.. అసలు విషయం తెలిసి అవాక్కయిన అధికారులు

చెక్కు మీద రూ. 100 కోట్లు అని రాసి ఉన్నది. దీంతో హుండీ లెక్కిస్తున్న సిబ్బంది ఉలిక్కిపడ్డారు. జోగులాంబ దేవాలయానికి రూ. 100 కోట్లు వేసే భక్తులు కూడా వస్తారా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు.. అసలు విషయం తెలిసి అవాక్కయిన అధికారులు
X

దక్షిణ కాశీగా పేరొందిన అలంపుర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలంపూర్ సమీపంలోనే కృష్ణ, తుంగభద్ర నదుల సంగమం అవుతుండటంతో ఈ క్షేత్రానికి విశిష్టత నెలకొన్నది. కాగా, ప్రతీ నెల ఈ ఆలయానికి సంబంధించిన హుండీని లెక్కిస్తారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈవో పర్యవేక్షణలో సిబ్బంది ఈ లెక్కింపును చేపడతారు. శనివారం ఇలా హుండీలోని నాణేలు, నోట్లు, ఇతర కానుకలను వేరు చేస్తూ లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ చెక్కు కనపడింది.

సదరు చెక్కు మీద అక్షరాలా రూ. 100 కోట్లు అని రాసి ఉన్నది. దీంతో హుండీ లెక్కిస్తున్న సిబ్బంది ఉలిక్కిపడ్డారు. జోగులాంబ దేవాలయానికి రూ. 100 కోట్లు వేసే భక్తులు కూడా వస్తారా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ చెక్కుపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది. భారీ విరాళం కావడంతో సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఆ చెక్కును చూసిన అధికారులకు డౌట్ వచ్చింది. వెంటనే సదరు చెక్ ఏ బ్యాంకుదో అని ఆరా తీశారు. అది వరంగల్‌లోని ఏపీజీవీబీ బ్యాంకుదిగా గుర్తించి ఆ బ్యాంకుకు ఫోన్ చేశారు. బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలు విని అధికారులు అవాక్కయ్యారు.

హుండీలో వేసిన చెక్ వరంగల్ బ్రాంచిది అయినా.. సదరు వ్యక్తి మాత్రం ఆలంపూర్‌కు చెందిన వాడేనని తెలిసింది. అంతే కాకుండా ఆ వ్యక్తి ఖాతాలో కేవలం రూ. 23 వేలు మాత్రమే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి కోసం ఆరా తీయగా అతడికి మతిస్థిమితం లేదని.. అతడిని కోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే పోలీసులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిసింది. దీంతో ఆలయ అధికారులు చేసేదేమీ లేక ఆ చెక్కును పక్కన పెట్టి భద్రపరిచారు. అదీ రూ. 100 కోట్ల చెక్కు కథ.

First Published:  16 Oct 2022 4:45 AM GMT
Next Story