Telugu Global
Telangana

టీ-కాంగ్రెస్‌లో వివాదం.. అన్న అటు.. తమ్ముడు ఇటు..

మల్లు సోదరుల భిన్న వ్యవహారశైలి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

టీ-కాంగ్రెస్‌లో వివాదం.. అన్న అటు.. తమ్ముడు ఇటు..
X

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తండ్రి కొడుకులు, భార్యభర్తలు, అన్నదమ్ములు చాలా మంది ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. కొంత మంది ఒకే పార్టీలో ఉంటుండగా.. మరి కొంత మంది వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. సాధారణంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు రాజకీయంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండటం చూస్తుంటాము. కానీ ఒకే పార్టీలో ఉన్నప్పుడు పెద్దగా విమర్శలు చేసుకోరు. సాధ్యమైనంత వరకు ఒకే తాటిపై నిలబడి రాజకీయం చేస్తుంటారు. అయతే మల్లు సోదరుల భిన్న వ్యవహారశైలి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

టీ-కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త ముసలం చెలరేగింది. పీసీసీ కమిటీల్లో వలస వచ్చిన (టీడీపీ నుంచి) వారికి ప్రాధాన్యత కల్పించారని సీనియర్లు ఫైర్ అవుతున్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న వారిని కాదని, వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని మండి పడుతున్నారు. ఇకపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సహకరించబోమని, ఆయన రూపొందించే కార్యక్రమాల్లో భాగస్వాములు కాబోమని బల్లగుద్ది చెప్పారు. రేవంత్ రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేసిన సీనియర్లు అందరూ శనివారం సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఇంటిలో కలుసుకున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సీనియర్లు అందరూ అతడిపై విమర్శలు చేశారు. కానీ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయనతో సఖ్యతగానే మెలిగారు. తీరా ఇప్పుడు వారిద్దరే అసమ్మతి వర్గాన్ని ముందుండి నడిపిస్తుంటడం గమనార్హం. భట్టి ఇంటిలోనే సీనియర్లు సమావేశం అయ్యారు. ఆ తర్వాత భట్టి విలేకరులతో మాట్లాడుతూ తమతో సంప్రదించకుండా పీసీసీ కమిటీలు ఎలా వేశారని ప్రశ్నించారు. కమిటీల కూర్పు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన వారికి అన్యాయం జరుగుతోంది. పార్టీని రక్షించుకోవల్సిన బాధ్యత ఉందని కామెంట్లు చేశారు.

కాగా, భట్టి అలా మాట్లాడుతుంటే.. ఆయన సోదరుడు మల్లు రవి మాత్రం సీనియర్ల కామెంట్లను తప్పు బడుతున్నారు. తమ్ముడు భట్టి ఇంట్లో సమావేశమైన సీనియర్ లీడర్ల తీరును ఆయన ఎండగట్టారు. ఏఐసీసీ వేసిన కమిటీలను తప్పుబట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. 22తో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్ తప్ప టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఎగ్జిక్యూటీవ్ కమిటీలో 40 మంది ఉంటే.. అందులో ఇద్దరు మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వాళ్లని.. 24 మంది ఉపాధ్యక్షుల్లో ఐదుగురు టీడీపీ నుంచి పార్టీలో చేరిన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఇక 84 మంది ఉన్న ప్రధాన కార్యదర్శుల లిస్టులో ఐదుగురు టీడీపీ వలస నాయకులు ఉండగా.. డీసీసీ అధ్యక్షుల్లో ఒక్కరు కూడా టీడీపీ వ్యక్తులు లేరని స్పష్టం చేశారు.

అన్నాదమ్ములు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరు వర్గాల్లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా, మల్లు సోదరులు మొదటి నుంచి కలిసి రాజకీయాలు చేయలేదు. అన్న మల్లు అనంతరాములు చనిపోయిన అనంతరం నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సొంత జిల్లా ఖమ్మం అయినా.. మల్లు రవి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో రవి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీతోనే అంటిపెట్టుకొని ఉన్నారు.

ఇక భట్టి విక్రమార్క మాత్రం సొంత జిల్లా ఖమ్మంలోనే రాజకీయ నాయకుడిగా స్థిరపడ్డారు. మధిర నుంచి వరుసగా గెలుస్తూ ఇప్పుడు ఏకంగా సీఎల్పీ లీడర్ అయ్యారు. కానీ మొదటి నుంచి అన్నదమ్ములు కలిసి ఎప్పుడూ రాజకీయం చేయలేదు. ఇప్పుడు కూడా ఇద్దరి వ్యవహార శైలి భిన్నంగా ఉన్నది. తమ్ముడు భట్టికి అన్న రవి కౌంటర్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.

పార్టీ మారిన నేతలకు కనీసం ఒకటో రెండో పదవులు ఇవ్వకపోతే వాళ్లు మాత్రం రాజకీయంగా ఎలా మనుగడ సాగిస్తారని కార్యకర్తలు అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన ప్రాధాన్యత ఇస్తేనే కదా.. వేరే వాళ్లు పార్టీలోకి రావడానికి ఉపయోగపడుతుందని కార్యకర్తలు వాదిస్తున్నారు. సీనియర్లు అందరూ కలసి పార్టీని నాశనం చేయడానికే ఇలా చేస్తున్నారని, వీరి వెనుక ఎవరో బలమైన వ్యక్తులు ఉండే ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మల్లు రవి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని.. తిరుగుబాటు చేస్తున్న సీనియర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.

First Published:  18 Dec 2022 7:44 AM GMT
Next Story