Telugu Global
Telangana

అదానీతో రేవంత్ టీమ్ మీటింగ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

రేవంత్ రెడ్డి సీఎం కాకముంది, అయిన తర్వాత.. అదానీపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

అదానీతో రేవంత్ టీమ్ మీటింగ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
X

దావోస్ పర్యటనలో భాగంగా అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు అదానీ, అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. అదానీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఆయనతో చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.



రేవంత్ రెడ్డి సీఎం కాకముంది, అయిన తర్వాత కూడా అదానీపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవల ప్రధానితో మీటింగ్ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అదానీ, ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ అనే ఇంజిన్ ఆల్రడీ షెడ్డుకు పోయిందని, 2024 ఎన్నికల తర్వాత ప్రధానికి కూడా అదే గతి పడుతుందన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే అదానీతో దావోస్ లో రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కావడం విశేషం.


సోషల్ మీడియాలో ట్రోలింగ్..

ఇప్పటికే దావోస్ లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూపై బీఆర్ఎస్ నుంచి ట్రోలింగ్ మొదలైంది. ఇంటర్వ్యూ చేసే వారు అడిగిన ప్రశ్న ఏంటి..? రేవంత్ ఇచ్చిన సమాధానమేంటి..? అంటూ కౌంటర్లు పడుతున్నాయి. తెలంగాణ సీఎం తొలిసారిగా దావోస్ వెళ్లారంటూ కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్నా.. బీఆర్ఎస్ నుంచి మాత్రం కౌంటర్లు తగ్గడంలేదు. తాజాగా అదానీ వ్యవహారం మరోసారి కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. గతంలో రాహుల్ గాంధీ అదానీపై చేసిన వ్యాఖ్యల్ని సైతం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

First Published:  17 Jan 2024 7:48 AM GMT
Next Story