Telugu Global
Telangana

విద్యుత్ కోతల్లో కుట్రకోణం.. రేవంత్ వార్నింగ్

తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఉద్యోగులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

విద్యుత్ కోతల్లో కుట్రకోణం.. రేవంత్ వార్నింగ్
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. ఇటీవల సాక్షాత్తూ మంత్రి సీతక్క పాల్గొన్న కార్యక్రమంలోనే కరెంటు పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పడింది, పరువు బజారున పడింది. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టిసారించారు సీఎం రేవంత్ రెడ్డి. కరెంటు కోతల విషయంలో ఆయన ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కొరత లేదని, ఆ కోతలు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేనని వ్యాఖ్యానించారు. అలా చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని, ఆ ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రభుత్వం మారిన వెంటనే కరెంటు ఉత్పత్తి తగ్గిపోవడం, కోతలు ఎక్కువ కావడం అనేవి సాధ్యమేనా..? పోనీ ఉత్పత్తి తగ్గిపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూసుకోకుండా ఉండదా..? ఈ ప్రశ్నల్ని చర్చకు తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కుట్రకోణం ఉందని అంటున్నారాయన. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఉద్యోగులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కరెంట్‌ కట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తామన్నారు. ప్రభుత్వం ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించట్లేదని, కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారన్నారు.

విద్యుత్ విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ విమర్శలను ఎదుర్కొంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోతలు ఎలా ఉండేవో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ నుంచి ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి ఆరోపణలు నిజమయ్యేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖ ఉద్యోగులు అలాంటి కుట్రలు చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. కొంతమంది ఉద్యోగుల వల్లే కరెంటు పోతోందనే కొత్తవాదన తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  22 Feb 2024 12:33 PM GMT
Next Story