Telugu Global
Telangana

షర్మిలకు రేవంత్ టిట్ ఫర్ టాట్..

ఇటీవల కాంగ్రెస్ గెలుపు ఖాయమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల.. సీఎం రేసులో ఉత్తమ్, భట్టి పేర్లు ప్రస్తావించారు కానీ రేవంత్ పేరెత్తకుండా తన బెట్టు చూపించారు. ఆ ప్రెస్ మీట్ కి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ తో బదులిచ్చేసినట్టయిందని అంటున్నారు ఆయన అభిమానులు.

షర్మిలకు రేవంత్ టిట్ ఫర్ టాట్..
X

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సీపీఐ బహిరంగంగా మద్దతు తెలిపింది, పొత్తు పెట్టుకుంది. తెలంగాణ జనసమితి టికెట్ ఆశించకుండానే కాంగ్రెస్ కి మద్దతిచ్చింది. టీడీపీ సంగతి సరేసరి. వీరందరితోపాటు వైఎస్సార్టీపీ కూడా కాంగ్రెస్ కి జై కొట్టింది. అనివార్య పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచారు. పొలిటికల్ సూసైడ్ అని తెలిసినా కూడా తాను ఆ పని చేయక తప్పలేదని ఇటీవలే వివరణ ఇచ్చారు షర్మిల. అయితే తెలంగాణలో కాంగ్రెస్ విజయోత్సవాల వేళ షర్మిల పాత్ర ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు కానీ షర్మిలను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారు. విజయశాంతికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన.. షర్మిల పేరు ప్రస్తావించకుండా ఆమెకు షాకిచ్చారు.

ఓ దశలో కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేద్దామనుకుని షర్మిల ముందుకొస్తే.. రేవంత్ రెడ్డి అడ్డుపుల్ల వేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రేవంత్ పై షర్మిల కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కాంగ్రెస్ గెలుపు ఖాయమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల.. సీఎం రేసులో ఉత్తమ్, భట్టి పేర్లు ప్రస్తావించారు కానీ రేవంత్ పేరెత్తకుండా తన బెట్టు చూపించారు. బ్లాక్ మెయిలర్ అంటూ పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కారు. ఆ ప్రెస్ మీట్ కి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ తో బదులిచ్చేసినట్టయిందని అంటున్నారు ఆయన అభిమానులు.

కాంగ్రెస్ గెలవాలి, కానీ రేవంత్ రెడ్డి సీఎం కాకుడదు.. అని కోరుకునేవాళ్లు కొంతమంది కాంగ్రెస్ లోనూ ఉన్నారు. కానీ ఎవరూ తొందరగా బయటపడటంలేదు. ఎంత కాదన్నా ఆయన పీసీసీ అధ్యక్షుడు, అధిష్టానం మద్దతు అందరికంటే ఎక్కువగా ఉన్న నాయకుడు. అందుకే చాలామంది ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి షర్మిల గరం గరంగా ఉన్నా.. ముందు ముందు కాంగ్రెస్ తో ఆమె ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


First Published:  3 Dec 2023 12:47 PM GMT
Next Story