Telugu Global
Telangana

ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్.. తారా స్థాయికి వ్యక్తిగత ఆరోపణలు

రేవంత్ రెడ్డిపై విచిత్రమైన పోలికలతో విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఆ విషయాన్ని తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు ఎర్రబెల్లి.

ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్.. తారా స్థాయికి వ్యక్తిగత ఆరోపణలు
X

తెలంగాణ ఎన్నికల పర్వంలో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. ఈరోజు కీలక నేతలంతా నామినేషన్లు వేయగా.. ర్యాలీలు, సభలు, సమావేశాలతో పొలిటికల్ హీట్ పెరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుకుంది. వ్యక్తిగత ఆరోపణలతో వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఎర్రబెల్లి వల్లే నాకీ పరిస్థితి..

పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎర్రబెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేలకోట్ల అక్రమ సంపాదనను మంత్రి దయాకర్ రావు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని, నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లి ప్రధాన కారణం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ బలహీన పడటానికి కూడా ఆయనే కారణం అంటూ ఆరోపించారు. వెన్నుపోటు వీరుడు, నమ్మక ద్రోహి అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ. 360 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఎర్రబెల్లి దానిని రూ.700 కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్నారని అన్నారు.

ఐటమ్ సాంగ్ రేవంత్..

రేవంత్ రెడ్డిపై విచిత్రమైన పోలికలతో విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తిలో సభకు వచ్చి, దగ్గరకు వచ్చిన జనాలను రేవంత్ రెడ్డి కాలితో తన్నాడని అన్నారాయన. పాలకుర్తి ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారన్నారు. పాలకుర్తి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఆ విషయాన్ని తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు ఎర్రబెల్లి. చంద్రబాబు కూడా దానికి అంగీకరించారన్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పెయింటర్ అని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి వచ్చాడని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ టికెట్ కోసం ఒక్కో అభ్యర్థి దగ్గర 10కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. దందాలు, బ్రోకరిజం బంద్ చేయాలని రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పానని, నీతి నిజాయితీతో ఉంటే బతకలేమని ఆనాడే తనకు రేవంత్ రెడ్డి చెప్పేవాడని.. తామంతా తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదని గుర్తు చేశారు. పాలకుర్తి ప్రజలు తనవెంటే ఉంటారన్నారు మంత్రి ఎర్రబెల్లి.

First Published:  9 Nov 2023 3:35 PM GMT
Next Story