Telugu Global
Telangana

భట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు

ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తోడుగా ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా విభేదాలు బయటపడ్డాయి.

భట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు
X

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కిలా ఉన్నది. రాష్ట్రంలో పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకొని రావాలని అధిష్టానం ఎంత ప్రయత్నించినా.. ఇక్కడి నాయకుల మధ్య విభేదాలతో అవన్నీ విఫలమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించబడిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ముదిరిపోయాయి. సీనియర్ నాయకులు ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనపై మొదటిగా తిరుగుబాటు చేశారు. చివరకు రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. వెంకటరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.

ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తోడుగా ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణలో పాదయాత్ర చేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తున్నది. పాదయాత్ర నేను చేస్తానంటే నేను చేస్తానని.. హైకమాండ్ వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇద్దరూ బయటకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. పాదయాత్ర స్టార్ట్ అయితే ఇద్దరి మధ్య ఉన్న వివాదం బ్లాస్ట్ కావొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 9 నుంచి యాత్ర చేసేందుకు గాను హైకమాండ్ నుంచి రేవంత్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్‌కు ఈ విషయం చెప్పగా.. ఆయన కూడా రేవంత్‌ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. రేవంత్ రెడ్డి సైలెంట్‌గానే పాదయాత్ర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్‌పై కూడా కసరత్తు జరిగింది.వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉండటంతో ఆరు నెలల్లో పాదయాత్ర పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి పాదయాత్రను భట్టి విక్రమార్క వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో రేవంత్ పాదయాత్ర చేస్తే పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడదని.. అది అతని ఇమేజ్ పెంచుకోవడానికే పనికొస్తుందని భట్టి వర్గం ఆరోపిస్తోంది. తానే పాదయాత్ర చేస్తానని కూడా భట్టి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి పాదయాత్రల అంశంపై హైకమాండ్ చర్చ చేస్తోంది. అవసరం అయితే ఇతర నేతలతో కూడా పాదయాత్రలు చేయించాలనే ప్రతిపాదనను కూడా భట్టి అధిష్టానం వద్ద పెట్టినట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో భట్టి విక్రమార్కతో పాదయాత్ర చేయిస్తే రేవంత్ రెడ్డి ఇతర బాధ్యతలు చూసుకుంటే బాగుంటుందని కొంత మంది సీనియర్ నేతలు సలహా ఇస్తున్నారు. అయితే మాస్ లీడర్ అయిన రేవంత్ పాదయాత్ర చేస్తేనే పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన వర్గం వాదిస్తోంది. కాగా, భట్టి మాత్రం భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానంటూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. భద్రాచలం నుంచి పినపాక, ములుగు, భూపాలపల్లి, మంథని, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆలేరు మీదుగా హైదరాబాద్ వరకు చేస్తానంటూ అధిష్టానానికి చెప్పారు.

వీరిద్దరి మధ్య పంచాయితీ నడుస్తుండగానే.. బస్సు యాత్ర తెరపైకి వచ్చింది. సీనియర్ నేతలందరూ కలసి రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఐక్యత ఉన్నట్లు ప్రజలకు సంకేతం ఇచ్చినట్లు ఉంటుందనే వాదన కూడా ఉన్నది. అయితే, అధిష్టానం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రలపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. రాహుల్ భారత్ జోడో యాత్ర ముగించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేయడానికి అధిష్టానం అనుమతులు ఇస్తోంది. కానీ, తెలంగాణ విషయంలోనే సీనియర్ల మధ్య పోటీ నెలకొనడం హైకమాండ్‌కు తలనొప్పులు తెస్తోంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం తన పాదయాత్రను ప్రారంభిస్తారని ఆయన వర్గం చెబుతోంది.ఈ పాదయాత్రల చిచ్చు చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

First Published:  27 Nov 2022 4:17 AM GMT
Next Story