Telugu Global
Telangana

వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ అది.. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. “ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును రేపు మేమే పూర్తి చేస్తాం” అని అన్నారు రేవంత్ రెడ్డి.

వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ అది.. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తాం
X

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కలికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించారు. గతంలో ఎన్నికలకోసం హడావిడిగా ఇక్కడ శంకుస్థాపనలు చేశారని, ఆ తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. ఆ మాటకొస్తే అసలీ ప్రాజెక్ట్ కి వైఎస్ఆర్ హయాంలో బీజం పడిందని గుర్తు చేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ఫేజ్ 2, స్టేజ్ 1కు 2005లో రూ.1750 కోట్ల నిధుల్ని ఆనాటి సీఎం వైఎస్ఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో శిలాఫలకం పడినా పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

రైతులు ప్రశ్నిస్తే వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారని.. ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని అంటున్నారని, ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటే రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. “ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును రేపు మేమే పూర్తి చేస్తాం” అని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ ప్రాంత రైతులకు ఇది తన హామీ అని చెప్పారు.


ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు స్థానిక సమస్యలపై అవగాహన లేదన్నారు రేవంత్ రెడ్డి. విహార యాత్రలకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే.. జర్మనీ నుంచి వచ్చి పోతున్నారని విమర్శించారు. కోర్టులను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్నారు. మానసికంగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  5 March 2023 10:05 AM GMT
Next Story