Telugu Global
Telangana

సీఎం, సీఎం.. రేవంత్ రియాక్షన్, కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్

రేవంత్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు నొచ్చుకుంటున్నారు. కాంపిటీషన్ ఉన్నప్పుడు రేవంత్ ఇలా చేశారేంటి అని అనుకుంటున్నారు.

సీఎం, సీఎం.. రేవంత్ రియాక్షన్, కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీకి చాలామంది పోటీలో ఉంటారు. ఎవరికి వారు తామే సీఎం అని చెప్పుకుంటున్నారు కూడా. తాము కూడా రేసులో ఉన్నామంటూ రోజుకొకరు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు ఇది ఓ విమర్శనాస్త్రంగా దొరికింది. కాంగ్రెస్ లో ఆరుగురు సీఎంలు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం, సీఎం అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు స్లోగన్లు ఇస్తుంటే, ఆయన వారిని మరింత ఎంకరేజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అనండి, ఇంకా బాగా అనండి..

సహజంగా పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు సీఎం, సీఎం అంటుంటే.. నాయకులు వద్దని వారిస్తారు. అంతా అధిష్టానం చూసుకుంటుంది, ఇప్పుడు గొడవ చేయొద్దని కార్యకర్తలను అనునయిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా బాగా అరవండి అన్నట్టుగా వారికి సైగ చేశారు. వారి స్లోగన్లు పెద్దగా వినపడేందుకు వీలుగా మైక్ ను వారివైపు ఉంచారు. ఈ ఘటన పరకాల విజయభేరి సభలో జరిగింది. రేవంత్ మరింత ఎంకరేజ్ చేయడంతో సీఎం సీఎం అనే నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది.

రేవంత్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు నొచ్చుకుంటున్నారు. కాంపిటీషన్ ఉన్నప్పుడు రేవంత్ ఇలా చేశారేంటి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో తన ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టడం కోసమే రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తించారా, లేక ఆయన వ్యూహం మరేదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద మరోసారి బీఆర్ఎస్ కి మంచి హాట్ డిస్కషన్ పాయింట్ అందించారు రేవంత్ రెడ్డి.

First Published:  21 Nov 2023 11:57 AM GMT
Next Story