Telugu Global
Telangana

రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి.. మౌనంగానే బీజేపీ నేతలు!

బీజేపీలో కేసీఆర్ మనుషులు ఉన్నారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డి రాజకీయం మొదలు పెట్టారు.

రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి.. మౌనంగానే బీజేపీ నేతలు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకడుగు ముందు పడితే.. నాలుగు అడుగులు వెనకకు అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి తయారయ్యింది. నిన్న మొన్నటి వరకు సీనియర్ల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త సద్దుమణగడంతో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతలు ఉన్నా.. ప్రజాకర్షణ కలిగిన నాయకులు మాత్రం కాస్త తక్కువగానే ఉన్నారు. దీంతో ఇతర పార్టీల్లోని నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు.

Advertisement

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీలో కేసీఆర్ మనుషులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డి రాజకీయం మొదలు పెట్టారు. బీజేపీలోని ఈటెల రాజేందర్ సహా ఇతర నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి రాజేందర్‌ను కాంగ్రెస్ లోనికి తీసుకొని రావడానికి గతంలో రేవంత్ విఫలయత్నాలు చేశారు. తాజాగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ లోకి ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు.

Advertisement

ఈటల రాజేందర్, వివేక్, జితేందర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ సిద్దాంతాలు నచ్చి వెళ్లలేదని.. వాళ్లు కేవలం కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీలో ఉన్నారని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు ఈ నేతలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీది తెలంగాణలో వాపే కాని బలం కాదని రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఇంకా బలంగానే ఉన్నదని.. బీజేపీలో ఉంటే మీ లక్ష్యం నెరవేరదు కాబట్టి తమ పార్టీలోకి రావాలని ఆయన కోరుతున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ చేరాలని భావించారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటం వల్లే ఆగిపోయినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్నే రేవంత్ రెడ్డి పలువురు బీజేపీ నేతలకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం ఉందని చెబుతూ వారిని ఆకర్షించే పనిలో పడినట్లు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా బీజేపీ నేతల నుంచి మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది.

మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్‌లో ఉంటే మరింత కాలం అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు ఆపరేషన్ ఆకర్ష్‌ను మాత్రం ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తే ఫామ్‌హౌస్ ఘటనలా మారుతుందనే భయంతోనే ఇలా రూటు మార్చినట్లు తెలుస్తున్నది.

Next Story