Telugu Global
Telangana

10 అడుగులు తగ్గి పనిచేస్తా.. పార్టీ అధికారంలోకి రావాలి

ప్రజల్లో కాంగ్రెస్ పై సానుభూతి ఉందని, దాన్ని మనం వాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌లో కోవర్టులు లేరని, వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి అందరూ కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

10 అడుగులు తగ్గి పనిచేస్తా.. పార్టీ అధికారంలోకి రావాలి
X

కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చేందుకు తాను 10 అడుగులు తగ్గి పనిచేస్తానని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో కష్టపడి పనిచేయకపోతే అసెంబ్లీ టికెట్ల విషయంలో పార్టీ కూడా పరిగణలోకి తీసుకోదని యూత్ కాంగ్రెస్ నేతల్ని హెచ్చరించారు. యూత్ డిక్లరేషన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

యువతే ముఖ్యం..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే యువతే ముఖ్యం అని చెప్పారు రేవంత్ రెడ్డి. యూత్ డిక్లరేషన్ ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో 25 వేలమందితో ఎన్రోల్ చేయించాలని సూచించారు. అలా చేస్తేనే యూత్ కాంగ్రెస్ నేతల పేర్లు టికెట్ల పరిశీలనలో ఉంటాయని చెప్పారు. కష్టపడి పనిచేయనివారి పేర్లు జాబితాలో కూడా ఉండవని సుతిమెత్తగా హెచ్చరించారు.

సానుభూతి ఉంది..

తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై సానుభూతి ఉందని, దాన్ని మనం వాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌లో కోవర్టులు లేరని, వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి అందరూ కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ను గద్దె దించి.. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. బీఆర్ఎస్‌ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రత్యామ్నాయంగా ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆ క్రెడిట్ మనదే..

తెలంగాణ ఆవిర్భావం లో బీఆర్‌ఎస్‌ పాత్ర లేదని అంటున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. అందుకే ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ తరపున ఘనంగా నిర్వహిద్దామని చెప్పారు. ప్రభుత్వం తరపున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది.

First Published:  23 May 2023 1:19 AM GMT
Next Story