Telugu Global
Telangana

మునుగోడులో ఓటుకు రూ.2 లక్షలు..

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మునుగోడులో గ్రామాలకు రోడ్లు వచ్చాయా..? డబుల్ బెడ్‌ రూం ఇళ్లు వచ్చాయా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎంపీటీసీ, సర్పంచ్‌లు కూడా పార్టీ మారినందుకు రూ.40 లక్షలు తీసుకుంటున్నారని చెప్పారు.

మునుగోడులో ఓటుకు రూ.2 లక్షలు..
X

ఓటుకు నోటు అంటే ఇదేదో వచ్చే ఉప ఎన్నికల్లో ఓటుకు ముట్టజెప్పే సొమ్ము అనుకోవద్దు. ప్రస్తుతానికి మునుగోడు ఓటుని అమ్ముకున్న రేటు అని అంటున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడులో ఒక్కో ఓటుని రూ.2 లక్షలకు ప్రధాని మోదీకి రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని చెప్పారు. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పే లాజిక్ ఏంటంటే.. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు 97 వేల ఓట్లు వేశారని.. ఆ ఓట్లను ప్రధాని మోదీకి రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంటే ఒక్కో ఓటు రూ.2 లక్షలు పలికినట్టు లెక్క. రూ.22వేల కోట్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరారని చెప్పారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను కల్పించిందని, కానీ ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు.

చీపుర్లతో కొట్టండి..

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మునుగోడులో గ్రామాలకు రోడ్లు వచ్చాయా..? డబుల్ బెడ్‌ రూం ఇళ్లు వచ్చాయా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎంపీటీసీ, సర్పంచ్‌లు కూడా పార్టీ మారినందుకు రూ.40 లక్షలు తీసుకుంటున్నారని చెప్పారు. అమ్ముడుపోయిన వాళ్లకు డబ్బులు వచ్చాయి కానీ.. ప్రజలకు ఏం వచ్చిందని నిలదీశారు. అమ్ముడుపోయిన నాయకులు గ్రామాల్లోకి వస్తే చీపురు కట్ట తిరగేయండని పిలుపునిచ్చారు. బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయొద్దని మునుగోడు ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మీరంతా పార్టీ ఆస్తి

మునుగోడులో 97 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని, అందరం కలిసి పని చేస్తే ఎవ‌రినైనా పడగొట్టొచ్చు అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు చొప్పున పార్టీకి సమయం కేటాయిస్తే, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ దేనని చెప్పారు.

కమ్యూనిస్ట్‌లకు ఏమైంది..?

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి మద్దతిస్తున్నట్టు ప్రకటించిన కమ్యూనిస్ట్ పార్టీలపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వారిని చూస్తే జాలేస్తోందని అన్నారు. బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్‌కి మద్దతిస్తున్నామని చెప్పిన కమ్యూనిస్ట్ లకు, 2018 ఎన్నికల్లో మునుగోడులో బీజేపీని ఓడించిన పార్టీ ఏదో తెలియదా అని అడిగారు. దేవరకొండలో కమ్యూనిస్ట్ అభ్యర్థికి మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. చివరకు వారి ఎమ్మెల్యేని కూడా టీఆర్ఎస్ లాగేసుకుంటే, ఇప్పుడు ఏకంగా ఆయా పార్టీల నేతలు వెళ్లి టీఆర్ఎస్‌కి మద్దతిస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మం, కరీంనగర్‌లో ఉండే కమ్యూనిస్ట్‌లు ఏమైనా చేసుకోండని చెప్పిన రేవంత్ రెడ్డి, మునుగోడులో ఉండే కామ్రేడ్స్‌ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

First Published:  3 Sep 2022 10:49 AM GMT
Next Story