Telugu Global
Telangana

బీజేపీలోకి వెళ్తారన్న వ్యాఖ్యలపై రేవంత్ రియాక్షన్

కాంగ్రెస్ కి 40 సీట్లు అంటే.. బీజేపీకి 400 సీట్లు రావాలనేది బీఆర్ఎస్ ఉద్దేశమని.. అంటే ఆ రెండు పార్టీలు ఒకటేనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

బీజేపీలోకి వెళ్తారన్న వ్యాఖ్యలపై రేవంత్ రియాక్షన్
X

"లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి" అంటూ ఇటీవల కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం స్పందించడంలేదని కూడా పలుమార్లు కేటీఆర్ ప్రస్తావించారు. అయితే రేవంత్ రెడ్డి ఈరోజు కేటీఆర్ విమర్శలపై స్పందించారు. బీజేపీలోకి తానెందుకు వెళ్తానని, బీజేపీతో కలిసి ఉండే పార్టీ బీఆర్ఎస్సేనని చెప్పారాయన.


లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాలు మాత్రమే వస్తాయంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కి 40 సీట్లు అంటే.. బీజేపీకి 400 సీట్లు రావాలనేది బీఆర్ఎస్ ఉద్దేశమని.. అంటే ఆ రెండు పార్టీలు ఒకటేనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో హంగ్ వస్తే తాము బీఆర్ఎస్ ని దగ్గరకు చేర్చేది లేదని, వారి మద్దతు ఎప్పుడూ బీజేపీకేనని వివరించారు. ఆ రెండు పార్టీలు ఒకటేనన్నారు రేవంత్.

ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు..

నీటి పంపిణీలో ఫస్ట్ ప్రయారిటీ తాగునీటి అవసరాలకేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయని.. ఆ నీటిని కేవలం తాగునీటి అవసరాలకే ఉంచామని చెప్పారు. రైతులకు కొంత నష్టమైనా తాము తాగునీటి అవసరాలకోసమే వాటిని పొదుపుగా వాడుతున్నామని వివరించారు. పంటలు ఎండిపోతున్నాయమని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. ముందే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇల్లు కాలిన తర్వాత చలిమంట వేసుకున్నట్టుగా వారి వ్యవహారం ఉందని విమర్శించారు రేవంత్ రెడ్డి.

First Published:  2 April 2024 2:44 PM GMT
Next Story