Telugu Global
Telangana

అది రాజీనామా లేఖ కాదు, సీస పద్యం..

హరీష్ రాజీనామా లేఖను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోలేదని అర్థమవుతోంది. దీనికి కొనసాగింపు ఏంటో వేచి చూడాలి.

అది రాజీనామా లేఖ కాదు, సీస పద్యం..
X

గతంలో సవాళ్లు ప్రతి సవాళ్లు అంటే కనీసం ఒకరోజో, రెండ్రోజులో గ్యాప్ ఉండేది. పోనీ ఒకటీ రెండు సార్లు నాయకులు సవాళ్లు విసురుకుని సైలెంట్ గా ఉండేవారు. కానీ తెలంగాణలో ఇప్పడు హరీష్ రావు, రేవంత్ రెడ్డి నిమిషాల వ్యవధిలోనే కొత్త కొత్త ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వీరి రాజీనామాల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఏకంగా రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వెళ్లారు హరీష్ రావు. అయితే ఆ రాజీనామా లేఖపై ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.


స్పీకర్ ఫార్మాట్ లో తాను రాజీనామా లేఖ రాసి తెచ్చానని, దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా ఆయన రాజీనామా లేఖ తేవాలని సవాల్ విసిరారు హరీష్ రావు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. హరీష్ రాజీనామా లేఖను ఎద్దేవా చేశారు. అది రాజీనామా లేఖ కాదని, అందులో సీస పద్యం రాసుకొచ్చారని అన్నారు. ఆగస్ట్-15 నాటికి రుణమాఫీతోపాటు మరిన్ని హామీలు అమలు చేయాలని, అలా చేసి చూపిస్తేనే తన రాజీనామా అంటూ అందులో కండిషన్లు పెట్టారని గుర్తు చేశారు. అది అసలు రాజీనామా లేఖ కాదని అన్నారు రేవంత్ రెడ్డి.

నాయకుల మధ్య రాజీనామాల సవాళ్లు వింటూనే ఉంటాం. కానీ ఇంత త్వరగా హరీష్ రావు స్పందిస్తారని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు, పైగా ఆయన రాజీనామా లేఖతోనే ఈరోజు గన్ పార్క్ వద్దకు వచ్చారు. దీంతో హడావిడి మొదలైంది. రేవంత్ రెడ్డి కూడా ఈ రాజీనామా లేఖపై త్వరగానే స్పందించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు నేతలు ప్రజల మధ్యే ఉండటం, మీడియా.. వారి సవాళ్లను పదే పదే గుర్తు చేయడంతో ఎపిసోడ్ త్వరగా క్లైమాక్స్ కి చేరింది. అయితే హరీష్ రాజీనామా లేఖను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోలేదని అర్థమవుతోంది. దీనికి కొనసాగింపు ఏంటో వేచి చూడాలి.

First Published:  26 April 2024 7:29 AM GMT
Next Story