Telugu Global
Telangana

పండగ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి వైరి వర్గం

తాజాగా రేవంత్ రెడ్డి వైరి వర్గం పండగ చేసుకుంటోంది. అధిష్టానం ఆయనకు మొట్టికాయలు వేసిందని సంబరపడుతోంది. దానికో బలమైన కారణం ఉంది.

పండగ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి వైరి వర్గం
X

ఎవరు ఔనన్నా, కాదన్నా.. అధిష్టానానికి ఎన్ని పితూరీలు చెప్పినా ఫిర్యాదులు చేసినా.. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి హవా ఏమాత్రం తగ్గట్లేదు. కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగి, గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నవారికంటే.. అధిష్టానం రేవంత్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. టీపీసీసీ చీఫ్ గా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం రావడం కూడా వైరి వర్గానికి ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి వైరి వర్గం పండగ చేసుకుంటోంది. అధిష్టానం ఆయనకు మొట్టికాయలు వేసిందని సంబరపడుతోంది. దానికో బలమైన కారణం ఉంది.

నల్గొండ దీక్ష రద్దు..

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. నల్గొండలో కూడా ఈనెల 21న నిరుద్యోగ నిరసన దీక్ష జరగాల్సి ఉంది. అయితే తనకు సమాచారమివ్వకుండా, తనతో చర్చించకుండా, తన జిల్లాలో నిరసన దీక్ష పెట్టడమేంటని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రభావంతో నల్గొండ నిరసన దీక్ష రద్దయింది.

నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరసన దీక్ష రద్దయినట్టు ప్రకటన వెలువడగానే రేవంత్ రెడ్డి వైరి వర్గం పండగ చేసుకుంటోంది. రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని అంటున్నారు నేతలు. అసలు కాంగ్రెస్‌ వర్సెస్‌ వలస కాంగ్రెస్‌ పోరులో అసలు కాంగ్రెస్‌ దే పైచేయి అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

అధిష్టానం ఏమన్నది..?

అధిష్టానం నిజంగానే రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసిందా, లేక సర్దుకు పోవాలని చెప్పిందా అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి నిరసన దీక్షలతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇగో ప్రాబ్లమ్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారేది రేవంత్ వర్గం ఆరోపణ. ఒకరకంగా ఈ వ్యవహారాన్ని తమకే అనుకూలంగా చెప్పుకుంటోంది రేవంత్ వర్గం. పార్టీకోసం పనిచేసేవారు ఎవరనే విషయం అధిష్టానానికి కూడా తెలిసిందని, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ కి అర్థమైందని అంటున్నారు కొంతమంది నేతలు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీకే నష్టమంటూ రేవంత్ వర్గం.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

First Published:  20 April 2023 1:29 PM GMT
Next Story