Telugu Global
Telangana

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్‌ లో చేరగానే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఐటీ దాడుల పేరుతో జరుగుతున్న కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని అన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
X

తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కావాలనే కాంగ్రెస్ నాయకుల్ని టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు పెరగడం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి సంకేతం అని చెప్పారు. తమ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలో చేరినవాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో? ఈ సోదాల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్న దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లు, కార్యాలయాల వైపు కన్నెత్తి కూడా చూడవని అన్నారు. కాంగ్రెస్ నేతలైన పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల, వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నాయని అన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్‌ లో చేరగానే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఐటీ దాడుల పేరుతో జరుగుతున్న కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరెన్ని దాడులు చేసినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లనీయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను బందీగా ఉంచుతున్నారని, అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందని తన లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.


First Published:  24 Nov 2023 7:56 AM GMT
Next Story