Telugu Global
Telangana

ఈటల కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ఈటల కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
X

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చినట్లే కనపడుతోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే చర్చ జరుగుతోంది. కర్ణాటక ఫలితాలను చూపించి కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరిన వాళ్లను తిరిగి రావాలంటూ పిలుపునిచ్చారు.

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను వీడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి రావల్సిన అవసరం ఉందని అన్నారు. వీళ్లెవరికీ బీజేపీ సిద్ధాంతంతోని సంబంధం లేదని.. వాళ్లు బీజేపీని నమ్మరు.. బీజేపీ వాళ్లను నమ్మదని రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఓడించ గలుగుతుందేమో అనే అపోహతో ఆ పార్టీతో చేరారు. తీరా ఆ పార్టీలో చేరిన తర్వాత వారికి వాస్తవం అర్థం అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని.. కుటుంబానికి పెద్దగా.. పీసీసీ అధ్యక్షుడిగా తనను ఏమైనా అన్నా తాను పట్టించుకోనని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఫలితాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉన్నది. మిత్రులందరూ దీన్ని గమనించి పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీలో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని వలస వెళ్లిన నాయకుడు గ్రహించి.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. వారి అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అసంతృప్తులను ఆహ్వానిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

First Published:  18 May 2023 11:41 AM GMT
Next Story