Telugu Global
Telangana

ఒక తలుపే తెరిచాం.. గేట్లన్నీ కాదు

గత నాలుగు నెలల్లో కాంగ్రెస్ పాలనలో అద్భుతాలు జరగకపోయినా, తప్పులు మాత్రం చేయలేదని తాము బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

ఒక తలుపే తెరిచాం.. గేట్లన్నీ కాదు
X

మేం తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటూ ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తెరవాల్సింది పార్టీ తలుపులు కాదు, ప్రాజెక్ట్ ల తలుపులు .. ఇవ్వాల్సింది రైతులకు సాగు నీరు అంటూ బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు కూడా పడ్డాయి. తాజాగా ఈ తలుపుల వ్యవహారంపై మరోసారి స్పందించారు రేవంత్ రెడ్డి. తాము ఇప్పటి వరకు తెరిచింది ఒక తలుపేనని, గేట్లు అన్నీ తెరవలేదని, తెరిస్తే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ అధిష్టానం ఇష్టం అని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.

ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఎమ్మెల్యే సగం దూరం వచ్చి ఆగారు, మిగతావాళ్లలో కొందరు తటపటాయిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి మిగతా చేరికలుంటాయనేది మాత్రం వాస్తవం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకుంటే భవిష్యత్ పై ఆశతో మిగతావారు బయటకు రారు, ఒకవేళ బీఆర్ఎస్ కి ఆశించిన స్థాయి ఫలితాలు రాకుండా కాంగ్రెస్ బలం పెరిగితే మాత్రం చేరికలను ఎవరూ ఆపలేరు. అందుకే ఈ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

రెఫరెండమే..

గత నాలుగు నెలల్లో కాంగ్రెస్ పాలనలో అద్భుతాలు జరగకపోయినా, తప్పులు మాత్రం చేయలేదని తాము బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఆశించిన ప్రకారం పని చేస్తున్నామని, తమ పాలన కొన్ని వర్గాలను ఎక్కువ సంతోషపెట్టి ఉండవచ్చనిస మరికొందరిని సంతోషపెట్టలేకపోయి ఉండవచ్చన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ప్రజలను నిరాశపరిచే విధంగా వ్యవహరించలేదనే నమ్మకం తమకు ఉందన్నారాయన. ఆ నమ్మకంతోనే లోక్ సభ ఎన్నికలను తమ 4 నెలల పాలనకు రిఫరెండంగా భావించమని చెబుతున్నామన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  29 April 2024 2:02 AM GMT
Next Story