Telugu Global
Telangana

జంపింగ్ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ ను మోసం చేసిన మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

జంపింగ్ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
X

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా సరే సరి, లేకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలలో కొందరు బీఆర్ఎస్ లోకి ఫిరాయించడం గ్యారెంటీ అనే ప్రచారం బయట జోరుగా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత కూడా ఇదే జరిగిందని కాంగ్రెస్ ని గెలిపించినా ఆ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరతారని బీజేపీ కూడా సెటైర్లు పేలుస్తోంది. ఈ దశలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జంపింగ్ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో చేరి.. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్న అభ్యర్థులను ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారు. అలాంటి వారిని కచ్చితంగా ఓడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్‌, సిద్ధిపేట జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫిరాయింపుదారులను ఓడించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనన్నారు. కాంగ్రెస్‌ ను మోసం చేసిన మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్‌ కు ఓటేయాలన్నారు. విద్యార్థుల బలిదానాలు ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. ఆ ప్రయోజనం నెరవేరలేదన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందన్నారు రేవంత్ రెడ్డి.

ఏడుసార్లు హుజూరాబాద్‌ లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ నియోజకవర్గ ప్రజలను నయవంచనకు గురి చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా తీసుకురాలేని అసమర్థ నాయకుడు ఆయన అన్నారు. దొంగ ఏడ్పులు ఏడ్చే ఈటల నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ హుజూరాబాద్‌ లో కోవర్టులు పోటీ చేస్తున్నారని, వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని.. పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎమ్మెల్సీ పదవి, కమీషన్ల కోసం కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ కి ద్రోహం చేశారన్నారు రేవంత్. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌ రావు దుబ్బాక అభివృద్ధికి ఏమైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. 2018లో ఎల్‌బీనగర్‌ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సుధీర్‌ రెడ్డిని గెలిపిస్తే, బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని విమర్శించారు.

First Published:  24 Nov 2023 1:35 AM GMT
Next Story