Telugu Global
Telangana

పోలింగ్ రోజు బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు..

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నరేళ్లయిందని, నాగార్జున సాగర్‌ ఎక్కడికీ పోదని, గేట్లు కూడా ఎక్కడికీ పోవని, నీళ్లు కూడా అక్కడే ఉంటాయని.. అలాంటిది ఇప్పటికిప్పుడు ఎందుకీ రచ్చ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

పోలింగ్ రోజు బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు..
X

తెలంగాణ సెంటిమెంట్‌ ను ఉపయోగించుకుని ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద.. ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై ఆయన స్పందించారు. పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఇలాంటి అంశాలను కావాలనే తెరపైకి తెచ్చారని, ఇది బీఆర్ఎస్ వ్యూహం అని మండిపడ్డారు.

కొడంగల్‌ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగేవాళ్లు అని చెప్పారు. నాగార్జున సాగర్ గొడవని.. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి విషయాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నరేళ్లయిందని, నాగార్జున సాగర్‌ ఎక్కడికీ పోదని, గేట్లు కూడా ఎక్కడికీ పోవని, నీళ్లు కూడా అక్కడే ఉంటాయని.. అలాంటిది ఇప్పటికిప్పుడు ఎందుకీ రచ్చ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈవో బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలని, ఉద్రిక్తతలు కొనసాగకుండా చూడాలని చెప్పారు రేవంత్ రెడ్డి.

విభజన సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలంటే ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏపీ సహా ఇతర రాష్ట్రాలతో ఉన్న నీటి సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని చెప్పారు. రెండు దేశాలే ప్రాజెక్టుల్లో నీటిని విభేదాలు లేకుండా పంచుకుంటున్నాయని.. అలాంటిది ఏపీ, తెలంగాణ మధ్య గొడవలెందుకని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపకాలు, ఇతర వివాదాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సమన్వయంతో పరిష్కరిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  30 Nov 2023 4:45 AM GMT
Next Story