Telugu Global
Telangana

ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ.. ఎవరెవర్ని ఏమేం అడిగారంటే..?

తొలిరోజు సీఎం రేవంత్ ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల గురించి వారికి గుర్తు చేశారు.

ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ.. ఎవరెవర్ని ఏమేం అడిగారంటే..?
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. తొలిరోజు ఆయన ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల గురించి వారికి గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించార‌ని గుర్తు చేసిన ఆయన.. అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారంటున్నారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారని తెలుస్తోంది.


ఇక రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 9వ షెడ్యూల్‌ లో పేర్కొన్న సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, 10వ షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని, ఢిల్లీలోని ఉమ్మ‌డి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని కూడా అమిత్ షా ని కోరారు రేవంత్ రెడ్డి. చ‌ట్టంలో ఎక్క‌డా పేర్కొన‌కుండా ఉన్న సంస్థ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్లెయిమ్ చేసుకుందనే విషయాన్ని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బ‌లోపేతానికి రూ.88 కోట్లు, సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో కోసం రూ.90 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు.

మెట్రోకోసం నిధులు..

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌లు ఆమోదించాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పురిని కలసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా చేప‌ట్టే విష‌యాన్ని ప‌రిగ‌ణించాల‌ని కోరారు. హైద‌రాబాద్‌ లోని మూసీ రివ‌ర్ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రణాళికను కూడా ఆయనకు వివరించారు. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఇళ్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు రేవంత్ రెడ్డి.

జలశక్తి మంత్రిని ఏమేం అడిగారంటే..?

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా క‌ల్పించాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి గజేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు అనుమ‌తులు వచ్చాయని, హైడ్రాల‌జీ, ఇరిగేష‌న్ ప్లానింగ్‌, అంచ‌నా వ్యయం వంటివి కేంద్ర జ‌ల సంఘం ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వాటికి వెంట‌నే ఆమోదం తెల‌పాల‌ని కోరారు. తమ అభ్యర్థనలకు మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు.

First Published:  5 Jan 2024 1:54 AM GMT
Next Story