Telugu Global
Telangana

ఇందిరమ్మ రాజ్యం అంటే..! రేవంత్ రెడ్డి వివరణ

ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీకి ఓటేస్తే.. మూసీలో పోయినట్టే అని ఎద్దేవా చేశారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే..! రేవంత్ రెడ్డి వివరణ
X

గత రెండు రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాగా వినిపిస్తున్న పేరు ఇందిరమ్మ రాజ్యం. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడంతో ఆ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వ్యాఖ్యల్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆరే స్వయంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి రాజ్యం అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారా, పార్టీ పెట్టేవారా అని ప్రశ్నించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఇందిరమ్మ రాజ్యం అంటూ పదే పదే ప్రస్తావిస్తూ ఘాటు విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటంటే..? అని వివరణ ఇస్తున్నారు.

ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లోని సగంమంది నాయకులు ఇందిరమ్మ రాజ్యంలోనే రాజకీయంగా ఎదిగారని, పదవులు తెచ్చుకున్నారని చెప్పారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చిన పార్టీ కాంగ్రెస్​ అని చెప్పారు. గిరిజనులు, దళితులు, పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా కాంగ్రెస్ చేసిందన్నారు. నాగర్జునసాగర్​, శ్రీశైలం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన పార్టీ కాంగ్రెస్సేనని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ అని, హైదరాబాద్ ​లో ఓఆర్ఆర్​, ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు సౌకర్యం, ఐటీ, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ అని వివరించారు.


దానంపై ఘాటు వ్యాఖ్యలు..

హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి రోడ్ షో లు నిర్వహించారు. నాంపల్లి, ఫిలింనగర్ ​లో పర్యటించిన ఆయన.. 20 ఏళ్లుగా ఎంఐఎం మాటలు నమ్మి మోసపోయారని, కాంగ్రెస్ ​ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భోజగుట్ట, శ్రీరాంనగర్, వివేకానంద నగర్, శివాజీ నగర్ బస్తీల్లోని పేదలకు అసదుద్దీన్ ఇళ్ల పట్టాలు ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. ఖైరతాబాద్ అంటే మొదటగా గుర్తొచ్చేది వినాయకుడు, ఆ తర్వాత గుర్తొచ్చేది జనార్ధన్ రెడ్డి పేరు అన్నారు రేవంత్ రెడ్డి. 20 ఏళ్ల తర్వాత పీజేఆర్ ఫ్యామిలీకి ఓటు వేసే అవకాశం వచ్చిందని, ప్రజలు ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటేస్తే.. మూసీలో పోయినట్టే అని ఎద్దేవా చేశారు. చింతల పాత చింతకాయ పచ్చడేనని, ఆయన గుడికే కాదు.. మీకూ పంగనామాలు పెట్టాడని విమర్శించారు. పంజాగుట్టలో బీడీలు అమ్ముకున్న దానంను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు పేల్చారు. అలాంటి కాంగ్రెస్ ఏం చేసిందని దానం ప్రశ్నించడం సిగ్గుచేటు అని అన్నారు రేవంత్ రెడ్డి.


First Published:  21 Nov 2023 2:36 AM GMT
Next Story