Telugu Global
Telangana

కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకం.. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్స్ ట్రా ప్లేయర్‌ అని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకం.. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి స్పందన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకాలు జోరుగా సాగాయనే ఆరోపణలున్నాయి. పక్క పార్టీల నుంచి వచ్చినవారికి హడావిడిగా కండువా కప్పి టికెట్ ఖాయం చేయడం వెనక కూడా డబ్బులు చేతులు మారాయని అన్నారు. స్వయానా ఆ పార్టీ నేతలు, టికెట్ దక్కని అసంతృప్తులు కూడా ఈ ఆరోపణలు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డిగా ప్రొజెక్ట్ చేశారు. ఈ విమర్శలన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు.

కాంగ్రెస్ లో పోటీ చేసే అభ్యర్థులే లేరని కొంతమంది అన్నారని, ఆ తర్వాత తాను టికెట్లు అమ్ముకున్నానని ఆరోపించారని, ఈ రెండిటికీ పొంతన లేదన్నారు. అభ్యర్థులే దొరకని పార్టీలో టికెట్ల కోసం పోటీ ఎందుకుంటుంది, ఎవరు కొంటారని లాజిక్ తీశారు. పోనీ టికెట్లు అమ్ముకునేంత డిమాండ్ ఉంటే.. తమ పార్టీ విజయావకాశాలపై అభ్యర్థులకు ఎంత ధీమా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అసలు కాంగ్రెస్‌ లో టికెట్ల కేటాయింపు పీసీసీ స్థాయిలో జరగదన్నారు రేవంత్ రెడ్డి. టికెట్లు అమ్ముకునే ప్రస్తావనే ఉండదన్నారు.

మా సీఎం అభ్యర్థి ఎవరంటే..?

పీసీసీ, సీఎల్పీ ఫేస్‌ గా కాంగ్రెస్ క్యాంపెయినింగ్ జరుగుతోందని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యక్తిగత నిర్ణయాలతో కక్ష సాధింపు ఉండదన్నారు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఎక్స్ ట్రా ప్లేయర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్స్ ట్రా ప్లేయర్‌ అని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆరోపించారు.


First Published:  24 Nov 2023 10:05 AM GMT
Next Story