Telugu Global
Telangana

రేవంత్ పిలుపున‌కు అంత సీన్ ఉందా..?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ మునుగోడు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నికార్సైన కాంగ్రెసోడా మునుగోడు తరలిరా అంటూ ఒక బహిరంగ లేఖ రాశారు.

రేవంత్ పిలుపున‌కు అంత సీన్ ఉందా..?
X

మునుగోడు ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి నాయకత్వానికి చావోరేవో అన్నట్టుగా మారింది. ఇప్పటికే సీనియర్లంతా హ్యాండిచ్చారు. ఒకవేళ గెలిస్తే ఎలాగో క్రెడిట్ మొత్తం తన ఖాతాలోనే రేవంత్ రెడ్డి వేసుకుంటారు కాబట్టి.. తామెళ్లి కష్టపడ్డా ప్రయోజనం శూన్యం అన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్లు సైలెంట్ అయ్యారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ఓపెన్ అయిపోయి స్పష్టత ఇచ్చేశారు. వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచారని ఫలితాల తర్వాత ప్రచారం చేసే అవకాశం కూడా లేదు. దాంతో రేవంత్ భావోద్వేగాలను కేడర్‌ను రగిల్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నీరు పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. తాజాగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో పౌరుషం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ మునుగోడు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నికార్సైన కాంగ్రెసోడా మునుగోడు తరలిరా అంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. ఆడ బిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేస్తుంటే ఇళ్లలోనే ఉండిపోతారా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. రండి కలిసి మునుగోడులో కదం తొక్కుదాం.. ప్రాణమో, ప్రజాస్వామ్యమో తేల్చుకుందామంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వారే ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Advertisement

అయితే రేవంత్ రెడ్డి పిలుపున‌కు కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తాయా? ఆయన ఆశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులు మనుగోడుకు వస్తాయా అన్నది చూడాలి. ఎన్నికకు ముందే మునుగోడుపై కాంగ్రెస్ శ్రేణులు ఒక అంచనాకు వచ్చేశాయని, ఈ సమయంలో బాధ్యతలు భుజానేసుకున్న రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహాన్ని వీడి తక్షణం మునుగోడుకు పరుగులు తీసేంత ఉత్సాహం కనబరుస్తారా అన్నది చూడాలి. అసలు రేవంత్ రెడ్డి ఒక విజిల్ వేయగానే కాంగ్రెస్ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చేంత పవర్‌ ఆయన పిలుపున‌కు ఉందా అన్నది కూడా అనుమానమే.

Next Story