Telugu Global
Telangana

రైతులకు ఉచిత కరెంటు 3 గంటలు చాలు -రేవంత్ రెడ్డి

రైతులకు ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజులో 3 గంటలసేపు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే చాలన్నారు.

రైతులకు ఉచిత కరెంటు 3 గంటలు చాలు -రేవంత్ రెడ్డి
X

తానా సభలకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడిన విషయాలన్నీ సంచలనం అవుతున్నాయి. ఎమ్మెల్యే సీతక్క సీఎం కూడా కావొచ్చంటూ అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కలకలం రేపాయి. తాజాగా ఆయన రైతులకు ఉచిత విద్యుత్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజులో 3 గంటలసేపు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే చాలన్నారు రేవంత్ రెడ్డి. అవసరం లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తోందని విమర్శించారు.

రేవంత్ లాజిక్ ఏంటంటే..?

ఉచిత విద్యుత్ 3 గంటలు చాలు అంటున్న రేవంత్ రెడ్డి ఓ లాజిక్ కూడా చెప్పారు. తెలంగాణలో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూములు ఉన్న చిన్న, సన్నకారు రైతులని అంటున్నారాయన. ఎకరాకు గంటలో నీరు పారుతుందని, ఆ లెక్కన మూడెకరాల రైతులకు మూడు గంటలు చాలని వివరించారు. మహా అయితే రోజుకి 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే ఎంత పెద్ద కమతాలున్న రైతులకయినా అది సరిపోతుందన్నారు.


ఉచిత విద్యుత్ పై ఆరోపణలు...

తెలంగాణ ప్రభుత్వం కేవలం విద్యుత్ సంస్థల కోసమే ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉచితం అనుచితంగా మారిందన్నారు. దాన్ని కేవలం స్వార్థానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారని.. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

First Published:  11 July 2023 4:13 AM GMT
Next Story