Telugu Global
Telangana

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్

పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన ఘనత సోనియాగాంధీది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని జడ్చర్ల సభలో ప్రజలకు హామీ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. జడ్చర్చలో కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్య అతిథిగా వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు.

పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన ఘనత సోనియాగాంధీది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందిందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అభివృద్ధిని గాలికి వదిలేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు.


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు కట్టిచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిచ్చిన గ్రామాల్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

జడ్జర్ల సభలో ఆసక్తికర ఘట్టం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని.. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ లోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరదాగా సవాల్ విసిరారు ఎంపీ కోమటిరెడ్డి. ఆ సవాల్ ని స్వీకరించిన రేవంత్ రెడ్డి... 12 కాదు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలను కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story