Telugu Global
Telangana

100 రోజుల్లో 2 గ్యారంటీలే అమలు

అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అది జరగలేదు. 6 గ్యారంటీల్లో కేవలం 2 గ్యారంటీలు మాత్రమే సంపూర్ణంగా అమల్లోకి వచ్చాయి. ఇంకా చాలా పథకాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

100 రోజుల్లో 2 గ్యారంటీలే అమలు
X

తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనకు 100రోజులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 5 హామీలు అమలు చేసింది ప్రభుత్వం. మొదట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంచింది. అర్హులైన వాళ్లకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 100రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదికను విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం.

అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అది జరగలేదు. 6 గ్యారంటీల్లో కేవలం 2 గ్యారంటీలు మాత్రమే సంపూర్ణంగా అమల్లోకి వచ్చాయి. ఇంకా చాలా పథకాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

పెండింగ్‌ హామీలు:

మహిళలకు ప్రతినెల రూ.2,500

రైతులకు ఏటా రూ. 15వేలు

విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు

ప్రతిమండలంలో ఇంటర్నేషనల్ స్కూల్‌

ప్రతినెల రూ. 4వేల పెన్షన్

6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఇందులో భాగంగా 3 హామీలిచ్చారు. మహిళలకు ప్రతినెల రూ. 2500, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. మొదటి గ్యారంటీ కింద 3 హామీలుంటే రెండే అమలు చేశారు. గ్యాస్‌ సిలిండర్, ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాయి. నెలకు రూ. 2500 హామీపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు.

6 గ్యారంటీల్లో రెండో గ్యారంటీ రైతు భరోసా. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు, వ్యవసాయ కూలీలకు రూ 12వేలు, వరి పంటకు రూ. 500 బోనస్‌ ఇస్తామని ఇందులో 3 హామీలిచ్చింది ప్రభుత్వం. కానీ ఈ గ్యారంటీలో ఏ హామీ పట్టాలెక్కలేదు. ఈ ఖరీఫ్‌ నాటికి రైతులకు రూ. 15వేలు అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుబంధులా అందరికీ కాకుండా సాగు చేసే భూములకే పథకం వర్తించేలా కసరత్తు చేస్తున్నారు. సాగు భూమిపై లిమిట్‌ కూడా పెట్టబోతున్నారు. మరి వ్యవసాయ కూలీల సంగతేంటన్నదానిపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇక రూ. 500బోనస్‌కు ప్రభుత్వం ఇప్పటికే మంగళం పాడింది. మద్దతు ధర రాకుంటేనే బోనస్‌ ఇస్తామని ఆ హామీకి తిలోదకాలిచ్చింది.

మూడో గ్యారంటీ గృహజ్యోతి. ఇందులో భాగంగా వైట్ రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. నాలుగో గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్లు. ఇల్లులేని పేదలకు ఇంటిస్థలంతో పాటు రూ. 5లక్షలు. ఇంటి స్థలనం ఉన్నవాళ్లకు రూ. 5లక్షలు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాచలం వేదికగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50వేల ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇళ్ల నమూనాను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

ఐదో గ్యారంటీ యువ వికాసం. ఇందులో భాగంగా రెండు హామీలిచ్చారు. మొదటిహామీ విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు. రెండో హామీ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్‌. అయితే ఈ రెండు హామీలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిదైన ఆరో గ్యారంటీ చేయూత. ఇందులో మొదటి హామీ వృద్ధులకు నెలకు రూ. 4వేల పెన్షన్. రెండో హామీ రూ. 10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. పెన్షన్‌పై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆరోగ్య బీమా మాత్రం అమలు చేస్తున్నారు. ఈ రకంగా 100రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం.. కేవలం రెండు గ్యారంటీలు మాత్రమే పూర్తిగా అమలు చేసింది.

First Published:  15 March 2024 6:27 AM GMT
Next Story