Telugu Global
Telangana

రేవంత్, భట్టి ఏమేం అడిగారు..? మోదీ ఇచ్చిన హామీలేంటి..?

ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యామని, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశామన్నారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

రేవంత్, భట్టి ఏమేం అడిగారు..? మోదీ ఇచ్చిన హామీలేంటి..?
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం, పీఎం మధ్య జరిగిన తొలి భేటీ ఇది. ఈ భేటీ ఆశాజనకంగానే జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించడంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.


ప్రధానితో భేటీ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భేటీ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశామన్నారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని, తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానిని కోరామని అన్నారు భట్టి.

ఇంకా ఏమేం అడిగారంటే..?

- స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు వెంటనే మంజూరు చేయాలి

- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి

- హైదరాబాద్‌ కు ఐఐఎం, సైనిక్‌ స్కూల్ కేటాయించాలి

- వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలి

బీఆర్ఎస్ పై విమర్శలు..

ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం.. పనిలో పనిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని అన్నారు భట్టి. నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నామని, కానీ ఆ నీళ్లు, నిధులు, నియామకాలనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని తాము ప్రధానిని కోరినట్టు తెలిపారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కూడా అభ్యర్థించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించామని చెప్పారు భట్టి.

First Published:  26 Dec 2023 4:06 PM GMT
Next Story