Telugu Global
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తా.. రేవంత్ రెడ్డి సరికొత్త రాగం!

అవసరం అయితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి అంతర్గత చర్చల్లో చెబుతున్నారట.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తా.. రేవంత్ రెడ్డి సరికొత్త రాగం!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. మిగిలిన వారిలో కూడా కొందరు తమకు ప్రాధాన్యత లభించడం లేదనే కారణంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దే చర్యలు తీసుకోవాల్సిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం.. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని వస్తానని బీరాలు పలుకుతున్నారు. ఇప్పటికే తనతో 12 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

తెలంగాణలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ ప్రజల్లో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. కానీ మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 35 నుంచి 40 చోట్ల మాత్రమే పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన చోట్ల అభ్యర్థుల కోసం ఇతర పార్టీల వారికి గాలం వేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమైనంతగా సీనియర్లను లాగేయాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకున్నది.

టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు. కీలక నేతలు పార్టీని వీడుతున్నా.. రేవంత్ అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉందని, సీనియర్లు పోయినా ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా ఉన్నారని రేవంత్ అంటున్నారు. అవసరం అయితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తానని అంతర్గత చర్చల్లో చెబుతున్నారట.

ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్లు తనతో టచ్‌లో ఉన్నారని రేవంత్ చెప్పుకుంటున్నారు. ఈ సారి వాళ్లకు టికెట్ వస్తుందో లేదో అనే డైలమాలో ఉన్నారని.. అలాంటి వారిని పార్టీలోకి తీసుకొస్తానని రేవంత్ అంటున్నారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. ఈ సారి కూడా అదే పద్దతిలో టికెట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ప్రజా వ్యతిరేకత ఉన్న వారిని కొందరిని కేసీఆర్ పక్కన పెడతారనే చర్చ నడుస్తోంది. అలా పక్కన పెట్టే వారిని తాను పార్టీలోకి తీసుకొస్తానని రేవంత్ చెప్పుకుంటున్నారు.

ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే ఏం లాభమని అప్పుడే కొంత మంది రేవంత్ వ్యూహంపై పెదవి విరిచినట్లు సమాచారం. ప్రజల్లోనే వారికి ఆదరణ లేక వేరే పార్టీ పక్కన పెడితే.. అలాంటి వారికి మనం టికెట్లు ఇవ్వడం అంటే కోరి ఓటమిని తెచ్చుకున్నట్లే అని సీనియర్లు హెచ్చరించారు. అయినా సరే రేవంత్ మాత్రం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలను ఆహ్వానించడమే సరైన పద్దతి అని.. బీజేపీలోకి వెళ్లనీయకుండా మన పార్టీలోకే తీసుకొని వద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

First Published:  13 Dec 2022 2:48 AM GMT
Next Story