Telugu Global
Telangana

స్థానిక భాషలను గౌరవించండి... విమానయాన సంస్థలకు కేటీఆర్ సూచన‌

విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఇండిగో విమానంలో జరిగిన ఓ సంఘటనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్ స్థానిక భాషలను గౌరవించాలంటూ విమానయాన సంస్థలకు సూచించారు.

స్థానిక భాషలను గౌరవించండి... విమానయాన సంస్థలకు కేటీఆర్ సూచన‌
X

స్థానిక భాషలను గౌరవించాలని విమానయాన సంస్థలను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. విమానం ప్రయాణించే రూట్లలో ఆ ప్రాంత భాష మాట్లాడగలిగే వాళ్ళను విమాన సిబ్బందిగా నియమించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసి ఈ విధంగా కామెంట్ చేశారు.

దేవస్మిత చక్రవర్తి అనే ఓ ట్విట్ట‌ర్ యూజర్ ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. అందులో ఈ నెల 16న జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు.

''సెప్టెంబర్ 16 న‌ విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే ఇండిగో 6E 7297 విమానంలో 2A XL సీటులో ఉన్న మహిళను, ఆమెకు ఇంగ్లీషుకానీ, హిందీ కానీ రాని కారణంగా మరో సీటుకు మార్చారు. 2A XL సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కావడం వల్ల భద్రతా సమస్య వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఫ్లైట్ అటెండర్ చెప్పారు. ఇది వివక్ష కాదా ? '' అని దేవస్మిత చక్రవర్తి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్ ''ప్రియమైన ఇండిగో మేనేజ్‌మెంట్, ఇంగ్లీష్, హిందీలో బాగా మాట్లాడలేని, స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగే ప్రయాణీకులను గౌరవించడం ఇప్పటికైనా ప్రారంభించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

ప్రాంతీయ రూట్లలో, తెలుగు, తమిళం, కన్నడ మొదలైన స్థానిక భాషలను మాట్లాడగల సిబ్బందిని నియమించుకోండి. ఈ సమస్యకు ఇదే సరైన పరిష్కారం.'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇండిగో ఫ్లైట్ మాత్రమే కాకుండా అన్ని ఫ్లైట్ లలో ఇదే వివక్ష కొనసాగుతోందని నెటిజనులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ రూట్లలో తిరిగే విమానాల్లో పని చేసే వాళ్ళు, పంజాబీ, గుజరాతీ కూడా మాట్లాడుతారని కానీ తెలుగు, కన్నడ లాంటి భాషలు మాత్రం రావని నెటిజనులు విమర్శలు చేశారు.

First Published:  18 Sep 2022 9:52 AM GMT
Next Story