Telugu Global
Telangana

రాజీనామా చేస్తేనే.. కడియంకి షాకిచ్చిన రేవంత్!

తెలంగాణలో ఎస్సీలకు మూడు ఎంపీ స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, గడ్డం వంశీని అభ్యర్థులుగా ప్రకటించారు

రాజీనామా చేస్తేనే.. కడియంకి షాకిచ్చిన రేవంత్!
X

కడియం శ్రీహరికి కాంగ్రెస్‌ పార్టీ బిగ్‌షాక్‌ ఇచ్చినట్టే తెలుస్తోంది. తన కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశించి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే కావ్యను కాకుండా శ్రీహరినే ఎంపీగా బరిలో దింపాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుందనే షరతు పెట్టినట్టు సమచారం.

ఒకవేళ కడియం శ్రీహరి అందుకు అంగీకరించని పక్షంలో వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ లేదా దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పెట్టిన మెలికతో కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది కడియం పరిస్థితి.

కాంగ్రెస్‌లో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న వాదనతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తెలంగాణలో ఎస్సీలకు మూడు ఎంపీ స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, గడ్డం వంశీని అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన వరంగల్‌ స్థానం నుంచి కూడా అదే మాల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే.. మాదిగ ఓటర్లను దూరం చేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ అధిష్టానం ఆందోళన పడుతోంది. దీనివల్ల కడియం శ్రీహరి అభ్యర్థి అయ్యే పక్షంలో నాగర్‌కర్నూల్‌లో మల్లు రవికి బదులుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది శ్రీహరికి టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

కడియంకు పెట్టిన కండీషన్‌నే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ అని స్పష్టం చేసింది. దీంతో ఆయన కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అన్నట్లుగా తయారైంది ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి.

First Published:  1 April 2024 4:25 PM GMT
Next Story