Telugu Global
Telangana

ఇక టీ-వ్యాలెట్‌‌తో పూర్తి స్థాయి లావాదేవీలు.. రూపకర్త టీఏకు ఆర్బీఐ లైసెన్స్

డిసెంబర్ 20న టీఏ సంస్థకు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సును ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఇకపై ఈ సంస్థ థర్డ్ పార్టీ అగ్రిగేటర్‌గా ఉండే అవకాశం ఉన్నది.

ఇక టీ-వ్యాలెట్‌‌తో పూర్తి స్థాయి లావాదేవీలు.. రూపకర్త టీఏకు ఆర్బీఐ లైసెన్స్
X

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ చేసిన తర్వాత నగదు కొరత ఏర్పడటంతో.. చాలా మంది డిజిటల్ పేమెంట్ల వైపునకు మళ్లారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పలు ప్రభుత్వ శాఖలకు చెందిన చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా అంగీకరిస్తోంది. డెబిట్, క్రెడిట్, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా పేమెంట్లను స్వీకరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి ఒక డెడికేటెడ్ వ్యాలెట్ ఉండాలనే ఉద్దేశంతో 2017 జూన్ 1న తెలంగాణకు ప్రత్యేకమైన'టీ-వ్యాలెట్'ను విడుదల చేసింది. ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనలు మేరకు రూపొందిన ఈ వ్యాలెట్ ద్వారా మీసేవ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, టీఎస్ఎస్‌పీడీసీఎల్, ఆర్టీఏ, సీడీఎంఏ, హెచ్ఎండీఏ, ఓఆర్ఆర్ టోల్ గేట్ల వద్ద చెల్లింపులు చేసే అవకాశం లభించింది.

టీ-వ్యాలెట్‌ను ట్రాన్‌సాక్షన్ అనలిస్ట్స్ (టీఏ) అనే సంస్థ నిర్వహిస్తోంది. యూఎస్ఏలోని పలు బడా బ్యాంకులు, వ్యాపార సంస్థల పేమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న కాటూరి శ్రీనివాస్.. టీఏ సంస్థను 2011లో ప్రారంభించారు. ఈ సంస్థ ఐటీ పేమెంట్స్ సర్వీసెస్, పీపీఐ వ్యాపారాన్ని 2014లో ప్రారంభించింది. అదే ఏడాదిలో ఈ కంపెనీకి ప్రీపెయిడ్ చెల్లింపుల లావాదేవీలు నిర్వహిచుకునే లైసెన్సును ఆర్బీఐ మంజూరు చేసింది. ఇక ఇదే కంపెనీ తెలంగాణ ప్రభుత్వ అధికార వ్యాలెట్.. టీ-వ్యాలెట్‌ను నిర్వహిస్తోంది. టీ-వ్యాలెట్ ద్వారా ఎక్కడి నుంచైనా, ఏ సమయంలో అయినా చెల్లింపులు చేసే సదుపాయం ఉన్నది.

తాజాగా డిసెంబర్ 20న టీఏ సంస్థకు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సును ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఇకపై ఈ సంస్థ థర్డ్ పార్టీ అగ్రిగేటర్‌గా ఉండే అవకాశం ఉన్నది. టీఏ సంస్థ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల తరపున కూడా పేమెంట్స్ అంగీకరించే అవకాశం ఏర్పడుతున్నది. అంటే టీ-వ్యాలెట్ ద్వారా ఇకపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి ఈ-కామర్స్ సంస్థలకు కూడా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.టీ-వ్యాలెట్‌ను ఇకపై జీపే, ఫోన్‌పే, పేటీఎం లాగా కూడా ఉపయోగించే వీలు ఉంటుంది. అయితే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.

దేశంలో చాలా కొద్ది ఫిన్‌టెక్ కంపెనీలకు మాత్రమే ఆర్బీఐ.. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సులను జారీ చేస్తోంది. పైన్ ల్యాబ్స్, పేయూ, రోజర్ పే, క్యాష్‌ఫ్రీ, సీపీ అవెన్యూ, బిల్ డెస్క్ వంటి సంస్థలు ఈ లైసెన్సు దక్కించుకోగా.. ఇప్పుడు ఓ తెలంగాణ సంస్థకు ఆర్బీఐ సదరు లైసెన్స్ మంజూరు చేయడం గమనార్హం. తమ కంపెనీకి ఈ లైసెన్స్‌ను ఆర్బీఐ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని టీఏ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో కాటూరి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే సంస్థ తరపున తాము అందిస్తున్న పీపీఐ సర్వీసులను మరింతగా విస్తరిస్తామని ఆయన అన్నారు.

First Published:  20 Dec 2022 2:50 PM GMT
Next Story