Telugu Global
Telangana

రేపిస్టుల విడుదలను రద్దు చేయండి.. కేటీఆర్ డిమాండ్

గుజరాత్ లో సామూహిక అత్యాచారం, హత్యల కేసులో శిక్ష పడ్డ 11 మంది నేరస్తులను అక్కడి ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రేపిస్టుల విడుదలను రద్దు చేయండి.. కేటీఆర్ డిమాండ్
X

ఈనెల 15 ..స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్ లో 11 మంది రేపిస్టులను ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ మండిడ్డారు. పంద్రాగస్టు నాడు మీరు చేసిన ప్రసంగంలో మహిళల గౌరవం గురించి గొప్పగా మాట్లాడారని, కానీ గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్షతో ఈ నిందితులు జైలు నుంచి రిలీజయ్యారని ఆయన ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రెమిషన్ (క్షమాభిక్ష) ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా చూడాలని ట్వీట్ చేశారు. ఈ ఆదేశాలను రద్దు చేసేలా చర్యలు తీసుకొండి.. దేశ మహిళలను గౌరవించాలని మీరు చేసిన ప్రసంగంలో నిజం ఉన్నపక్షంలో ఇందుకు పూనుకొండి.. రేపిస్టులను విడుదల చేయరాదని కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ గుజరాత్ ప్రభుత్వం వీరిని జైలు నుంచి రిలీజ్ చేసింది. ఇది సముచితం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడినవారిపట్ల కఠిన చర్యలు తీసుకునేవిధంగా ఐపీసీ చట్టాలను సవరించాలని ఆయన కోరారు. రేపిస్టులకు బెయిల్ లభించకుండా చట్ట సవరణలు చేయాలన్నారు, బలమైన చట్టాలు ఉండాలి.. అప్పుడే కోర్టులు త్వరితగతిన తీర్పులు ఇవ్వగలుగుతాయి. అని ఆయన అన్నారు.


2002 లో గోధ్రా అల్లర్ల అనంతరం బిల్కిస్ బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురిని హతమార్చారు. ఆ దారుణ ఘటనలో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. అయితే 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరిని జైలు నుంచి విడుదల చేశారు. ఈ రేపిస్టుల విడుదలను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా ఖండించారు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ ప్రభుత్వం వీరి విడుదలపై నిర్ణయం తీసుకుందన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకునేలా చూడాలని ఆయన కూడా కోరారు.

First Published:  17 Aug 2022 7:06 AM GMT
Next Story