Telugu Global
Telangana

35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషరేట్ పునర్వవస్థీకరణ.. వివరాలు వెల్లడించిన కమిషనర్ సీవీ ఆనంద్

కొత్త సచివాలయం కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది సమీపంలోనే ఉన్న బీఆర్కే భవన్‌లో ఉంటుందని సీవీ ఆనంద్ చెప్పారు.

35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషరేట్ పునర్వవస్థీకరణ.. వివరాలు వెల్లడించిన కమిషనర్ సీవీ ఆనంద్
X

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను 35 ఏళ్ల తర్వాత పునర్వవస్థీకరిస్తున్నారు. మెగా సిటీ పోలీస్ ప్రాజెక్టులో భాగంగా కొత్త జోన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలైనట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిందని చెప్పారు.

35 ఏళ్ల క్రితం హైదరాబాద్ జనాభాతో పోల్చుకుంటే.. ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో పోలీస్ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతులు కల్పించాలని, శాంతి భద్రతల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఒక పునర్వవస్థీకరణ కమిటీని ఏర్పాటు చేయగా.. 6 నెలల పాటు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించిందని చెప్పారు. 35 ఏళ్ల క్రితం 25 లక్షల జనాభా ఉండగా.. ఇప్పడు 85 లక్షలకు పెరిగిందని కమిషనర్ పేర్కొన్నారు.

హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరగడంతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక పునర్వవస్థీకరణ కమిటీ కూడా పోలీస్ స్టేషన్లు పెంచాలనే నివేదిక ఇవ్వడంతో.. కొత్త పోలీస్ స్టేషన్లకు పచ్చజెండా ఊపినట్లు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 2 డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 5 కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కొత్త సచివాలయం కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది సమీపంలోనే ఉన్న బీఆర్కే భవన్‌లో ఉంటుందన్నారు. సచివాలయం భద్రత కోసం ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 35 శాతం సివిల్ కానిస్టేబుల్స్, 120 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇక కొత్త పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లలతో కలిపితే కమిషనరేట్ పరిధిలో 78 పోలీస్ స్టేషన్లు అవుతాయని అన్నారు.

జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్లలో ఎప్ఐఆర్‌ల నమోదు ప్రారంభం అవుతుందని సీవీ ఆనంద్ వెల్లడించారు. అన్ని స్టేషన్లకు కావల్సిన సామాగ్రి, వాహనాలు, కంప్యూటర్లు, బైకులు అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌గా మార్చినట్లు తెలిపారు. బీఆర్కే భవన్‌లో సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్, ఫిల్మ్‌నగర్ కోఆపరేటీవ్ సొసైటీ ప్రాంగణంలో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్, రెహ్మత్ నగర్ ఓపీ భవనాన్ని మధురానగర్ పోలీస్ స్టేషన్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ భవనంలో మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్, బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇక సైబర్ క్రైమ్ కోసం ఒక డీసీపీతో పాటు 148 మంది పోలీసులను కేటాయించినట్లు తెలిపారు.

Next Story