Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాలు అమ్మి రూ.లక్షలు సంపాదించిన రేణుక

రేణుక సోదరుడు రాజేశ్వర్.. తమ వద్ద టీఎస్‌పీఎస్సీ ఏఈ ప్రశ్నాపత్రం ఉందని.. దానికి రాసే వాళ్లు ఉంటే అమ్ముతామని తిరుపతయ్యకు చెప్పాడు.

టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాలు అమ్మి రూ.లక్షలు సంపాదించిన రేణుక
X

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో తవ్వే కొద్దీ కొత్త లింకులు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న రేణుక, ఆమె భర్త ఢాక్యా, సోదరుడు రాజేశ్వర్ ఏఈ, గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రాలు అమ్మి రూ.లక్షల్లో సంపాదించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రశ్నాపత్రాలు కొనుక్కున్న వాళ్లు పరీక్ష రాసి 100కు పైగా మార్కులు పొందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరితో పాటు పేపర్ కొని రాసిన నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను పోలీసులు అరెస్టు చేశారు.

రేణుక తల్లి తమ గ్రామంలో సర్పంచ్‌గా పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే ఆమె సోదరుడు రాజేశ్వర్ పర్యవేక్షిస్తుండేవాడు. అలాగే గ్రామ పంచాయతీ పనులకు కాంట్రాక్టర్‌గా తిరుపతయ్య వ్యవహరించేవాడు. కాగా, రేణుక సోదరుడు రాజేశ్వర్.. తమ వద్ద టీఎస్‌పీఎస్సీ ఏఈ ప్రశ్నాపత్రం ఉందని.. దానికి రాసే వాళ్లు ఉంటే అమ్ముతామని తిరుపతయ్యకు చెప్పాడు. దీంతో తిరుపతయ్య ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర కుమార్‌ల గురించి తెలుసుకొని వారికి రేణుక భర్త ఢాక్యా నాయక్‌ద్వారా రూ.లక్షలు తీసుకొని క్వశ్చన్ పేపర్ అమ్మినట్లు సిట్ విచారణలో తేలింది. ఇలా పేపర్లు అమ్మి రేణుక ఫ్యామిలీనే లక్షల రూపాయలు సంపాదించిందని సిట్ అధికారులు అంటున్నారు.

ఇప్పటిక ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌తో పాటు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు రమేశ్, షమీమ్, సురేశ్‌ను మరోసారి కస్టడీకి తీసుకున్నది. వీరిందరినీ మరో నాలుగు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. కమిషన్‌లో పని చేస్తున్న మొత్తం 26 మంది ఉద్యోగులు గ్రూప్-1 పరీక్ష రాశారు. మిగిలిన ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజీలాండ్‌లో ఉంటున్నారు. ఆయనకు కూడా ప్రశ్నాపత్రం పంపి పరీక్ష పరీక్ష రాయించారు. ఈ కేసులు ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న అందరినీ సిట్ అరెస్టు చేసింది. న్యూజీలాండ్‌లో ఉన్న ఒక్క ప్రశాంత్‌‌ను అరెస్టు చేయాల్సి ఉన్నది.

కాగా, ఈ కేసులో బ్లాక్ మెయిల్ ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. కమిషన్‌కు చెందిన షమీమ్, రమేశ్ కలిసి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తున్నది. మొదట వీరిద్దరినీ ప్రవీణ్, రాజశేఖర్ ప్రలోభాలకు గురి చేసినట్లు సిట్ అధికారులు అనుమానించారు. అయితే వీళ్లే రాజశేఖర్, ప్రవీణ్‌లను బ్లాక్ మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బ్లాక్ మెయిల్‌కు దిగింది ముగ్గురా? ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలు సిట్ పరిశీలిస్తోంది. ఈ రోజు కూడా సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

First Published:  30 March 2023 2:00 AM GMT
Next Story